MSP | న్యూఢిల్లీ, జూన్ 19: వరికి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) రూ.117 పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. 2024-25 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి మొత్తం 14 పంటల ఎంఎస్పీని పెంచింది. వరి పంటకు ఎంఎస్పీని రూ.117 పెంచడంతో(5.35 శాతం) క్వింటాల్ వరి రూ.2,300కి చేరింది. త్వరలో హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎంఎస్పీ ధరలను పెంచడం గమనార్హం.
మహారాష్ట్రలోని వధావన్ వద్ద రూ.76,200 కోట్లతో ఆల్ వెదర్ గ్రీన్‌ఫీల్డ్ డీప్ డ్రాఫ్ట్ మేజర్ పోర్టును అభివృద్ధి చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే 12 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. పీపీపీ పద్ధతిలో ఈ పోర్టు నిర్మాణం జరుగుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. ప్రధాని మోదీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ఎయిర్‌పోర్టు అభివృద్ధికి రూ.2,869.65 కోట్ల ప్లాన్‌కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా కొత్త టెర్మినల్ భవనం నిర్మించడంతోపాటుగా రవ్వే విస్తరణ, ఏడాదికి 99 లక్షల మంది ప్రయాణాలు చేసేలా ఎయిర్‌పోర్టు సామర్థ్యాన్ని పెంచనున్నారు. పవన విద్యుత్తు ప్రాజెక్టుల నిర్మాణం కోసం రూ.7,453 కోట్లతో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) స్కీమ్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా గుజరాత్, తమిళనాడు రాష్ర్టాల్లో 500 మెగావాట్ల చొప్పున సామర్థ్యంతో రెండు పవన విద్యుత్తు ప్రాజెక్టులను నిర్మించనున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశంలో కొత్త క్యాంపస్‌లు, ల్యాబ్‌లతో కూడిన ఫోరెన్సిల్ మౌలిక సదుపాయాల నిర్మాణానికి రూ.2,254.43 కోట్లతో నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్‌హ్యాన్స్‌మెంట్ స్కీమ్(ఎన్ఎఫ్ఐఈఎస్)కు కూడా క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.
