న్యూఢిల్లీ, మే 30: పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకుని 2025 మార్చి 31వ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్) సబ్‌స్ర్కైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్(యూపీఎస్) కింద అదనపు ప్రయోజనాలు పొందనున్నారు. ఎన్పీఎస్ ప్రయోజనాలు ఇదివరకు పొందినప్పటికీ ఈ ప్రయోజనాలు అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పథకం కింద యూపీఎస్‌ని కోరుకున్న రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరిసారి తీసుకున్న జీతంలో పదో వంతును పూర్తి చేసుకున్న సర్వీసుకు కరవు భత్యాన్ని కలుపుకుని ఏక మొత్తంగా(ఒకేసారి) రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని పొందుతారు.
రిటైర్డ్ ఉద్యోగులకు సాధారణ వడ్డీతో బకాయిలు చెల్లించనున్నట్లు ప్రకటన తెలిపింది. వీటిని పొందడానికి దరఖాస్తు చేసుకోవడానికి 2025 జూన్ 30ని చివరి తేదీగా పేర్కొన్నది. ఆర్థిక శాఖ జనవరిలో యూపీఎస్‌ని నోటిఫై చేసింది. దీని కింద ఉద్యోగ విరమణకు ముందు చివరి 12 నెలల బేసిక్ పేని సగటున తీసుకుని దానిలో 50 శాతం పింఛనుగా లభిస్తుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారు కోరుకుంటే యూపీఎస్ వర్తిస్తుంది.