న్యూఢిల్లీ, డిసెంబర్ 2: అన్ని మొబైల్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్‌ని తప్పనిసరిగా ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ మొబైల్ ఫోన్ తయారీ కంపెనీలకు జారీచేసిన ఆదేశాలపై కేంద్రం వెనక్కు తగ్గింది. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై సెల్‌ఫోన్ కంపెనీలతోపాటు నిపుణుల నుంచి వ్యక్తిగత గోప్యతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు, ప్రభుత్వ నిఘా ఉంటుందన్న భయాందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్ర టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం వీటిపై స్పష్టతనిచ్చారు. సంచార్ సాథీ యాప్ యాక్టివేట్ చేసుకోవడం కేవలం ఐచ్ఛికం మాత్రమేనని, ఇది తప్పనిసరి కాదని ఆయన ప్రకటించారు. అంతేగాక ఈ యాప్‌ని ఎవరైనా తొలగించుకోవచ్చని కూడా ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన ఈ సైబర్ సెక్యూరిటీ యాప్ ఎటువంటి నిఘా పెట్టడం కాని కాల్ మానిటరింగ్ కాని చేయబోదని స్పష్టం చేశారు.
పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ యాప్‌ని ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చని, యాక్టివేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇది పనిచేస్తుందని ఆయన వివరణ ఇచ్చారు. అయితే సంచార్ సాథీ యాప్‌ని డిజేబుల్ చేయడం లేదా డీయాక్టివేట్ చేయడం సాధ్యం కాదంటూ మొబైల్ ఫోన్ తయారీ సంస్థలకు జారీచేసిన ఉత్తర్వులో ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం దీనిపై వెనుకడుగు వేయడం గమనార్హం. ఇష్టమైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇష్టం లేకపోతే యాక్టివేట్ చేసుకోవద్దు. సంచార్ సాథీ యాప్ వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అదేమీ తప్పనిసరి కాదు. అది కేవలం ఐచ్ఛికం మాత్రమే అని సింధియా తెలిపారు. సైబర్ మోసాలను అడ్డుకునే లక్ష్యంతోనే ఈ యాప్‌ని తీసుకువస్తున్నామే తప్ప అందులో ఎటువంటి దురుద్దేశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.
అయితే టెలికం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకటన, సెల్‌ఫోన్ తయారీ కంపెనీలకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు పరస్పర విరుద్ధంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సంచార్ సాథీ యాప్‌ని యూజర్లు డిలీట్ చేసుకోవచ్చని మంత్రి చెబుతుండగా ప్రభుత్వ ఆదేశాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు. యాప్ పనితీరును డిజేబుల్ లేదా అడ్డుకోవడం సాధ్యం కాదన్నది ప్రభుత్వ ఉత్తర్వుల సారాంశంగా ఉంది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ జారీచేసిన సర్క్యులర్‌లోని క్లాజ్ 7(బీ)ని ఉటంకిస్తూ మంత్రి ప్రకటనా లేక అధికారిక ఉత్తర్వులనా దేన్ని పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. భారత్‌లో తయారైన లేక దిగుమతి చేసుకున్న అన్ని కొత్త మొబైల్ ఫోన్లలో 90 రోజుల్లోపల సంచార్ సాథీ యాప్‌ని ముందుగానే ఇన్స్టాల్ చేసి కస్టమర్లకు విక్రయించాలని సెల్ ఫోన్ తయారీదారులు, దిగుమతిదారులకు కేంద్రం గతవారం తన ఉత్తర్వులో ఆదేశించింది.
సంచార్ యాప్‌ని ముందుగానే ఇన్స్టాల్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వ్యతిరేకించాలని దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ యాపిల్ నిర్ణయించినట్లు తెలిసింది. తమ ఆందోళనలను భారత ప్రభుత్వానికి తెలియచేయాలని కంపెనీ భావిస్తోంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లపై నిఘా పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.