న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: నాలుగేండ్ల క్రితం మొదలవ్వాల్సిన దేశ జనాభా లెక్కల ప్రక్రియపై మోదీ సర్కార్ ఎట్టకేలకు కసరత్తు మొదలుపెట్టింది! జనగణన ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని సంబంధిత వర్గాలు ఆదివారం మీడియాకు తెలిపాయి. పౌరుల నుంచి సమాచారాన్ని సేకరించేందుకు ‘రిజిస్ట్రార్ జనరల్, సెన్సెస్ కమిషనర్’ కార్యాలయం 31 ప్రశ్నలను సిద్ధం చేసింది. అయితే.. దీంట్లో కులం అనే కాలమ్ ఉంటుందా? లేదా? అన్నదానిపై కేంద్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నదని సమాచారం! దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా వెల్లడించాయి.
మనదేశంలో 1881 నుంచి ప్రతి పదేండ్లకోసారి దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్ని సేకరిస్తున్నారు. దీని ప్రకారం జనగణనలో తొలి దశ 2020 ఏప్రిల్ 1న మొదలుకావాలి. కొవిడ్ కారణంగా కేంద్రం పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కూడా జనాభా లెక్కలతో ముడిపడి ఉందన్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్ బిల్లును ఆమోదించిన తర్వాత చేపట్టిన తొలి జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ కసరత్తును పూర్తిచేయాల్సి ఉంటుంది. అటు తర్వాత చట్టసభల్లో మూడింట ఒకవంతు స్థానాల్ని మహిళలకు రిజర్వ్ చేస్తారు. సబ్సిడీ పథకాల అమలుకు 2011 జనాభా లెక్కలను కాకుండా, తాజా గణాంకాల్ని తీసుకొని పథకాల్ని అమల్లోకి తేవాలని వివిధ రాజకీయ పార్టీలు గట్టిగా కోరుతున్నాయి.