న్యూఢిల్లీ: మొబైల్ వాడకందారులపై నిఘా పెట్టేందుకు వీలుగా ఫోన్లలో శాటిలైట్ లొకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ అన్నివేళలా యాక్టివేట్‌గా ఉండేలా చేయాలని స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ఒత్తిడి తీసుకురావాలన్న టెలికం పరిశ్రమ ప్రతిపాదనను కేంద్రం సమీక్షిస్తున్నట్లు తెలిసింది. అయితే దీనివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందన్న కారణంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు యాపిల్, గూగుల్, శాంసంగ్ ఈ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. దర్యాప్తులో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కొందరి నిర్దిష్టమైన ఫోన్ లొకేషన్ల కోసం టెలికం సంస్థలకు న్యాయపరమైన అభ్యర్థనలు పంపినప్పటికీ కావలసిన సమాచారం లభించడం లేదని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
కచ్చితమైన లొకేషన్ని గుర్తించాలంటే స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీ శాటిలైట్ సిగ్నల్స్‌ని, సెల్యులార్ డాటాను ఉపయోగించుకోగలవు. దీని వల్ల మొబైల్ ఫోన్ ఉన్న నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించడం తమకు సులభవుతుందని రిలయెన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి తెలిపింది.
జీపీఎస్ టెక్నాలజీని యాక్టివేట్ చేయాలని స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు ప్రభుత్వం లేఖ రాయాలని జూన్‌లో సీఓఏఐ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. యూజర్లు డిజేబుల్ చేయడానికి అవకాశం లేకుండా స్మార్ట్ఫోన్లలో లొకేషన్ సర్వీసెస్‌ని ఎల్లప్పుడూ యాక్టివేట్ చేసి ఉంచడం స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు మాత్రమే సాధ్యపడుతుంది. అయితే ఇది యూజర్లకు తప్పనిసరి అన్న నిబంధన ఉండకూడదని యాపిల్, గూగుల్ ప్రభుత్వానికి స్పష్టం చేసినట్లు తెలిసింది.