న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల జీతాలు 24 శాతం పెరిగాయి. ఈ పెరుగుదల 2023 ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తుంది. వ్యయ ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది. ప్రస్తుత ఎంపీల రోజువారీ భత్యాలను కూడా పెంచుతున్నట్లు వెల్లడించింది. మాజీ ఎంపీలకు పింఛను, ఐదేళ్లకు మించి పని చేసిన ప్రతి సంవత్సరానికి ఇచ్చే అదనపు పింఛనులను కూడా పెంచినట్లు తెలిపింది.
తాజా సవరణల ప్రకారం, ఎంపీల జీతం నెలకు రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు, నియోజకవర్గం అలవెన్స్ నెలకు రూ.70,000 నుంచి రూ.87,000కు, కార్యాలయం ఖర్చుల అలవెన్స్ నెలకు రూ.60,000 నుంచి రూ.75,000కు పెరిగాయి. ఒక్కొక్క ఎంపీకి రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెరిగింది. మాజీ ఎంపీల పింఛను రూ.31,000కు పెరిగింది. ఐదేళ్లకు మించి పని చేసిన ప్రతి సంవత్సరానికి ఇకపై నెలకు రూ.2,500 పింఛను అదనంగా లభిస్తుంది.
ఎంపీలు తమ పదవీ కాలంలో ఒకసారి రూ.1 లక్ష విలువైన మన్నిక గల ఫర్నిచర్‌ను, రూ.25,000 విలువైన నాన్ డ్యూరబుల్ ఫర్నిచర్‌ను కొనవచ్చు. సెంట్రల్ ఢిల్లీలోని విఠల్‌భాయ్ పటేల్ హౌస్ హాస్టల్, టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వరకు రకరకాల వసతి సదుపాయాలను కూడా పొందవచ్చు. నీరు, విద్యుత్తు, టెలిఫోన్, ఇంటర్నెట్ ఛార్జీలను కూడా పొందవచ్చు. ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు తమ నియోజకవర్గం నుంచి ఢిల్లీకి 34 వన్ వే విమాన టికెట్లను పొందడానికి అర్హులు.