(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిన్నరపాటు నిరసనోద్యమం చేసిన రైతన్నలపై నమోదైన అన్ని కేసులను ఎత్తేస్తామన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు మాట తప్పింది. అన్నదాతలపై 10 వేల వరకూ కేసులు నమోదైతే, కేవలం 86 కేసులనే ఎత్తేసింది. ఈ మేరకు పార్లమెంట్లో కేంద్ర మంత్రి తోమర్ శుక్రవారం వెల్లడించారు. దీనిపై సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు మండిపడ్డారు. కేసుల ఎత్తివేతపై ప్రధాని మోదీ మాట తప్పారని, దేశానికి అన్నం పెట్టే రైతన్నపై ప్రభుత్వం కత్తిగట్టిందని ధ్వజమెత్తారు. రైతులపై నమోదు చేసిన అన్ని కేసులను వెంటనే ఎత్తేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ వేధింపుల పర్వం
అన్ని కేసులను ఎత్తేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. రైతులపై మొత్తం 10 వేల వరకు కేసులు నమోదైతే, 86 కేసులనే ఎత్తేసినట్టు ఇప్పుడు చెప్తున్నారు. అన్నదాతలను ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్నది. బీజేపీ సర్కారు రైతులను మోసం చేసింది.
–బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్ చడూనీ