తిరువనంతపురం, ఆగస్టు 22: గవర్నర్ వ్యవస్థ ద్వారా తమపై పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండటంతో గవర్నర్ అధికారాలకు కత్తెరవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా చర్యలు చేపడుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు గవర్నర్ అధికారాలకు కత్తెర వేయగా, తాజాగా కేరళ ప్రభుత్వం కూడా ఇందుకు సిద్ధమైంది. యూనివర్సిటీ చాన్స్‌లర్‌గా గవర్నర్‌ను తొలగించేందుకు ఉద్దేశించిన బిల్లును సీఎం పినరయి విజయన్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఇటీవలి కాలంలో గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదాలు తీవ్రమైన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్‌లు, వీసీల నియామకాల విషయంలో సీఎం, గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి. కాగా, దేశంలో విభజన శక్తులను అడ్డుకోవడానికి, వారిని ఓడించడానికి పోరాడాలని కేరళ అసెంబ్లీ తీర్మానించింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా విభజన శక్తులకు వ్యతిరేకంగా సీఎం పినరాయి విజయన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎంతో చరిత్ర గల ప్రజాస్వామ్య భారతదేశంలో విభజన శక్తులు రెచ్చిపోతున్నాయని, ఈ శక్తులను కలిసికట్టుగా ఓడిద్దామని సభ తీర్మానించింది.