న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 574 జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఆలస్యంగా నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 300 ప్రాజెక్టులు ఏడాది, 253 ప్రాజెక్టులు 1-3 ఏండ్లు, 21 ప్రాజెక్టులు మూడేండ్లకుపైగా ఆలస్యమయ్యాయని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. మరోవైపు వచ్చే ఏడాది చివరి నాటికి దేశంలో ఏఐ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థ అమలులోకి వస్తుందని గడ్కరీ వెల్లడించారు. దీని కారణంగా ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడంతో పాటు వాహనదారులు టోల్‌ప్లాజాల వద్ద వేచి చూసే సమయం పూర్తిగా పోతుందని చెప్పారు. రాజ్యసభలో బుధవారం ప్రశ్నోత్తర సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఇకపై ఉపగ్రహ, ఏఐ అధారిత కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుందన్నారు.
బీమా బిల్లుకు పార్లమెంట్ ఆమోదం ; 100% ఎఫ్‌డీఐకి రాజ్యసభ గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ, డిసెంబర్ 17: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని(ఎఫ్‌డీఐ) 100 శాతానికి పెంచడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్ బుధవారం ఆమోదించింది. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐకి అనుమతి ఉంది. ఎఫ్‌డీఐని 100 శాతం పెంచడం వల్ల బీమా రంగం వ్యాప్తి చెంది, తక్కువ ప్రీమియంతోపాటు ఎక్కువ ఉపాధి సృష్టి జరగవచ్చని ప్రభుత్వం ఆశిస్తోంది. సబ్కా బీమా సబ్కీ రక్ష(బీమా చట్టాల సవరణ) బిల్లును రాజ్యసభ బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఈ బిల్లు మంగళవారం లోక్‌సభ ఆమోదం పొందింది. కాగా, తదుపరి పరిశీలన నిమిత్తం బిల్లును జేపీసీకి పంపాలన్న ప్రతిపాదనతోపాటు ప్రతిపక్షం సమర్పించిన పలు సవరణలను రాజ్యసభ తిరస్కరించింది.
అణు రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యం
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి తలుపులు తెరిచేందుకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులు వాకౌట్ చేయగా అణు రంగంలో సంస్కరణలకు సంబంధించిన శాంతి బిల్లును మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది.