Central Force | కోల్‌కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాలలో (Kolkata Hospital) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనను నిరసిస్తూ వైద్యులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేపడుతున్నారు. విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర బలగాలు (Central Force) మెడికల్ కళాశాల, ఆసుపత్రిని సందర్శించారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (Central Industrial Security Force) బృందం బుధవారం ఉదయం మెడికల్ కళాశాల, ఆసుపత్రి వద్దకు చేరుకొని భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించింది. అక్కడ భద్రతా ఏర్పాట్లపై స్థానిక పోలీసులు, ఆసుపత్రి వర్గాలను ఆరా తీసింది. ఈ సందర్భంగా సీనియర్ సీఐఎస్ఎఫ్ అధికారి ప్రతాప్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ‘మాకు కేటాయించిన పని నిమిత్తం ఇక్కడికి వచ్చాం. మా పని మమ్మల్ని పూర్తి చేసుకోనివ్వండి. దీనిపై ఉన్నతాధికారులు మీకు తెలియజేస్తారు’ అని తెలిపారు.
జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆగస్టు 15 అర్ధరాత్రి పశ్చిమబెంగాల్ అట్టుడికిన విషయం తెలిసిందే. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గురువారం అర్ధరాత్రి ఆర్జీ కార్ హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దవాఖాన ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.
ఈ ఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా తీసుకొని మంగళవారం విచారణ జరిపింది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ దవాఖానపై వందల మంది దుండగులు దాడి చేయడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విధ్వంసకారులపై తీసుకొన్న చర్యలపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దవాఖానపై జరిగిన మూకదాడి, ఘటనాస్థలి నుంచి పోలీసులు పారిపోయారన్న ఆరోపణలను న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. క్రైమ్ సీన్ ఉన్న దవాఖానపై దాడి, విధ్వంసం జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించింది. వైద్యులు విధుల్లోకి తిరిగి వెళ్లేలా దవాఖాన వద్ద సీఐఎస్ఎఫ్ (CISF) బలగాలను మోహరించాలని ఆదేశించింది. అదేవిధంగా కేసు దర్యాప్తులో పురోగతిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే సీఐఎస్ఎఫ్ బలగాలు ఇవాళ ఆర్జీకార్ కళాశాల, ఆసుపత్రిని సందర్శించారు.
Also Read..
Badlapur | బద్లాపూర్ ఘటన.. 300 మంది నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు
Polygraph Test: ఆర్జీ కార్ ఆస్పత్రి ప్రిన్సిపాల్‌కు పాలీగ్రాఫ్ పరీక్ష !