మొన్న గ్యాస్ మోత.. నిన్న పెట్రో వాత.. నేడు సీఎన్జీ బాంబ్.. సామాన్యుడిపై రోజుకో బండ వేస్తున్న కేంద్రంలోని బీజేపీ సర్కార్.. త్వరలో విద్యుత్తు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. నెలవారీ కనీస చార్జీలు పెంచాలంటూ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రతిపాదించడం ఆందోళన కలిగిస్తున్నది. ఐదు రాష్ర్టాల ఎన్నికలకు ముందు ధరల పెంపు ఉండబోదని పదేపదే ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్నికల కాగానే ప్లేటు ఫిరాయించింది. రోజుకో సేవలపై రేట్ పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. ఫలితాలు వెలువడిన రెండు రోజులకే వాణిజ్య సిలిండర్‌పై ఏకంగా రూ.993 పెంచిన మోదీ సర్కార్.. అనంతరం పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.3 చొప్పున వడ్డించింది. ఇక సీఎన్జీపై రూ.3 చొప్పున పెంచింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మండుతున్న ధరలతో అల్లాడిపోతున్న జనం.. మోదీ సర్కార్ ఎప్పుడు ఏ రేట్లు పెంచుతుందో అని హడలిపోతున్నారు. తాజాగా విద్యుత్తు బిల్లులు మోత మోగించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు రావడంతో జనం షాక్‌కు గురవుతున్నారు.
న్యూఢిల్లీ, మే 17: పశ్చిమాసియా యుద్ధ సంక్షోభంతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వాతను ఎదుర్కొంటున్న పౌరులకు ఇప్పుడు విద్యుత్ చార్జీల షాక్ ప్రమాదం పొంచి ఉంది. నెలవారీ కనీస విద్యుత్ చార్జీలు పెంచాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇది అమలు చేస్తే తక్కువ విద్యుత్ వాడకం, ఎక్కువ విద్యుత్ వాడకం అన్న తేడా లేకుండా విద్యుత్ వినియోగదారులందరిపై ఆర్థిక భారం పడనుంది. ఒక ఆంగ్ల మీడియా కథనం ప్రకారం కొన్ని పరిశ్రమలు స్వయం విద్యుత్ ఉత్పత్తిపై ఆధారపడటం, చాలామంది వినియోగారులు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంటున్న కారణంగా పెరుగుతున్న ఖర్చులను రాబట్టుకోవడానికి కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చేసిన ఈ ప్రతిపాదన విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) కు ఎంతో మేలు కలిగిస్తుంది.
కొత్త ప్రతిపాదనలతో డిస్కంలకు కాసుల పంట
ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే చాలా విద్యుత్ బిల్లులను కనీస నెలవారీ విద్యుత్ చార్జీల పరిధిలోకి తప్పనిసరిగా తెస్తారు. అంటే వినియోగదారుడు తాము వినియోగించిన విద్యుత్‌తో సంబంధం లేకుండా ఎక్కువ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. కొత్త ప్రతిపాదన విద్యుత్ సంస్థలకు అపార ఆదాయాన్ని తెచ్చిపెడుతుండగా, సామాన్యుడి జేబుకు భారీగా చిల్లు పడుతుంది. ఈ ప్రతిపాదనలను ఫోరమ్ రెగ్యులేటర్స్ ముందు ఉంచనున్నారు. ప్రస్తుతం డిస్కమ్‌లు యూనిట్ ఆధారిత టారిఫ్‌ల ద్వారా తమ స్థిర వ్యయాలను రాబట్టుకుంటున్నాయి. అయితే విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నప్పుడు వీటి ఆదాయం గణనీయంగా తగ్గిపోతున్నది. విద్యుత్ సరఫరా మౌలిక సదుపాయాలు, ఉద్యోగుల జీతాలు, నెట్వర్క్ నిర్వహణ, విద్యుత్ జనరేటర్ల వ్యయం తదితర వాటికి వినియోగ సంస్థ మొత్తం వ్యయాల్లో 38 నుంచి 56 శాతం ఖర్చవుతున్నది. అయితే స్థిర నెలవారీ చార్జీలు మొత్తం ఆదాయంలో 9 నుంచి 20 శాతం వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి.
దశల వారీగా వాత
ప్రస్తుతం కొన్ని పరిశ్రమలు, అత్యధిక ఆదాయ వర్గాల వారు రూఫ్ టాప్ సోలార్, ఓపెన్ యాక్సిస్ వ్యవస్థల ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటున్నందున డిస్కమ్ నుంచి తక్కువ మొత్తంలో విద్యుత్‌ను కొంటున్నారు. ఇది వాటి ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతున్నది. దీని నుంచి గట్టెక్కేందుకు సమతుల్యంగా, దశల వారీగా ఈ స్థిర నెలవారీ చార్జీలను పెంచుతూ పోవాలన్నదని సీఈఏ ప్రతిపాదన. దీని ప్రకారం 2030 నాటికి గృహ, వ్యవసాయ వినియోగదారులపై 25 శాతం, పరిశ్రమ, వాణిజ్య, సంస్థాపర వినియోగదారులకు 100 శాతం పెంచుతూ పోవాలి. రూఫ్‌టాప్ సౌర విద్యుత్ వినియోగదారులకు, నెట్ మీటరింగ్ విధానం కిందకు వచ్చే వినియోగదారులకు ప్రత్యేక సుంకాల విధానాలను ప్రవేశపెట్టాలని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ తన ప్రతిపాదనల్లో సూచించింది.
సీఎన్జీ ధర మళ్లీ పెంపు.. ; కిలో సీఎన్జీపై రూపాయి 2 రోజుల క్రితం రూ.2 పెంపు
కేంద్రంలోని మోదీ సర్కార్ ఇంధన ధరల్ని క్రమంగా పెంచేందుకు రంగం సిద్ధం చేసింది. రెండు రోజుల క్రితం (మే 16న) సీఎన్జీ గ్యాస్ ధరను 2 రూపాయలు పెంచిన కేంద్రం, ఆదివారం వీటి ధరల్ని మరోమారు స్వల్పంగా పెంచింది. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం ‘ఎన్సీఆర్’, మధ్యప్రదేశ్‌లలో కిలో సీఎన్జీపై రూపాయి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో కిలో సీఎన్జీ ధరలు ఢిల్లీలో రూ.80.09, నోయిడా, ఘజియాబాద్‌లలో రూ.88.70, భోపాల్‌లో రూ.93.75కు చేరుకున్నాయి. పైపుల ద్వారా సరఫరా చేస్తున్న ‘వంటగ్యాస్’ ధరల్లో ఎలాంటి మార్పులూ చేపట్టలేదు. దీని కంటే ముందు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల్ని రూ.3 వరకు పెంచిన సంగతి తెలిసిందే.