న్యూఢిల్లీ: వినియోగదారులను మాయ చేసి, వారి సమ్మతి లేకుండా, గుట్టుగా బిల్లును పెంచే పద్ధతులేమైనా ఉన్నాయేమో సొంతంగా ఆడిట్ చేసుకుని, వాటిని తొలగించాలని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) ఆదేశించింది. తమకు నచ్చిన దానిని ఎంపిక చేసుకునేందుకు వినియోగదారులకు గల స్వేచ్ఛను కట్టడి చేసే లేదా అనుచిత వ్యాపార లావాదేవీలకు దారి తీసే సూచనలు, నిబంధనలు, పద్ధతులు తమ ఇంటర్‌ఫేస్‌లలో ఉన్నాయేమో సొంతంగా తనిఖీ చేయాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ శనివారం చెప్పింది.
ఇటువంటి డార్క్ ప్యాటర్న్‌లను తమ ఇంటర్‌ఫేస్‌ల నుంచి మూడు నెలల్లోగా తొలగించాలని తెలిపింది. డార్క్ ప్యాటర్న్‌లను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. వివిధ మంత్రిత్వ శాఖలు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు ఈ గ్రూప్‌లో ఉన్నారు.
వినియోగదారులకు అదనపు ఉత్పత్తులను లేదా సేవలను అంటగట్టడం, విరాళాలను స్వీకరించడం కూడా డార్క్ ప్యాటర్న్‌లో భాగం. వినియోగదారుల సమ్మతి లేకుండానే ఇటువంటివాటిని చేర్చి, తద్వారా వారి నుంచి ఎక్కువ సొమ్మును ఈ-కామర్స్ సంస్థలు పొందుతాయి.