Content Creators | న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఆన్లైన్ ద్వారా వార్తలు, వర్తమాన అంశాలను ప్రసారం చేసే, కంటెంట్‌ను తయారుచేసే కంటెంట్ క్రియేటర్లు ఇక కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోకి రానున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ప్రసార సేవల(నియంత్రణ) చట్టంలో పలు నిబంధనలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ చట్టం కోసం ముసాయిదాను తయారుచేసి 2023 నవంబరులో ప్రజాభిప్రాయ సేకరణకు విడుదల చేసింది. అయితే, ఇటీవల ఈ ముసాయిదాలో కొన్ని మార్పులు చేసింది. ఈ ముసాయిదా ప్రకారం.. సోషల్ మీడియా అకౌంట్లు, ఆన్లైన్ వీడియో క్రియేటర్లకు సైతం ఈ చట్టం వర్తించనుంది.
కొత్త ముసాయిదాలో ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్’ లేదా ‘వార్తలు, వర్తమాన అంశాల కంటెంట్ ప్రచురణకర్త’ అనే కొత్త క్యాటగిరీని కేంద్రం చేర్చింది. వ్యవస్థీకృత వ్యాపారం, వృత్తిపరంగా, వాణిజ్య కార్యకలాపాల్లో భాగంగా ఆన్లైన్ పత్రిక, వార్తల పోర్టల్, వెబ్సైట్, సోషల్ మీడియా వేదికలు, ఇంకా ఇలాంటి ఇతర మాధ్యమాల ద్వారా వార్తలు, వర్తమాన అంశాలను ప్రసారం చేసే వ్యక్తి లేదా సంస్థను ‘డిజిటల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్’గా పేర్కొన్నది.
ఈ ముసాయిదా ప్రకారం డిజిటల్ న్యూస్ బ్రాడ్‌కాస్టర్ క్యాటగిరిలో ఉండే వారు.. వారి గురించి, వారి సంస్థ గురించి, తయారుచేసే కంటెంట్ గురించి కేంద్ర ప్రసార శాఖకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు, వీరు సొంతంగా, తమ ఖర్చులతో కంటెంట్ ఎవాల్యువేషన్ కమిటీ(సీఈసీ)లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీలో మహిళలు, శిశు సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు తదితర విభిన్న సమూహాలపై జ్ఞానం ఉన్న వారు ఉండేలా చూసుకోవాలి. ఈ కమిటీల్లో ఉండే సభ్యుల పేర్లను కూడా కేంద్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు పాటించకపోతే మొదటిసారి రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
మూడేండ్లలో మళ్లీ ఈ ఉల్లంఘనలకు పాల్పడితే రూ.2.5 కోట్ల జరిమానా విధించవచ్చు. ఓటీటీ బ్రాడ్కాస్టర్లు, డిజిటల్ న్యూస్ బ్రాడ్కాస్టర్లకు సంబంధించిన సమాచారం అందించకపోతే సోషల్ మీడియా కంపెనీలపైనా చర్యలు తీసుకునేందుకు ఈ ముసాయిదా ప్రకారం అవకాశం ఉంది. ఈ చట్టం ముసాయిదా దశలోనే ఉందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో ప్రటించారు. అయితే, వేగంగానే ఈ చట్టం చేసే దిశగా కేంద్రం ప్రయత్నిస్తున్నది. జూన్ 4 నుంచి ఇప్పటివరకు కొత్త ముసాయిదాపై పరిశ్రమ నిపుణులు, భాగస్వామ్యపక్షాలతో కనీసం ఆరు సమావేశాలు జరిపిందని సమాచారం.