Air Quality | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : గాలి నాణ్యత మెరుగుదలలో తెలంగాణలోని నల్లగొండ సత్తా చాటింది. జైపూర్‌లో ‘స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం’పై జరిగిన జాతీయ వర్క్ షాప్‌లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ -2024కు సంబంధించి కేంద్ర పర్యావరణ శాఖ జాతీయ పరిశుభ్ర వాయు నగరాల అవార్డులను ప్రకటించింది. మూడు లక్షల కన్నా తక్కువ జనాభా ఉన ్న విభాగంలో రాయ్‌బరేలి (యూపీ), నల్లగొండ (తెలంగాణ), నలగర్ (హిమాచల్ ప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచి అవార్డులు కైవసం చేసుకున్నాయి. ఇక 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో సూరత్, జబల్పూర్, ఆగ్రా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.
3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల్లో ఫిరోజాబాద్ (యూపీ), అమరావతి (మహారాష్ట్ర), ఝాన్సీ (యూపీ) అగ్ర స్థానంలో నిలిచాయి. గాలి నాణ్యతలో అధిక మెరుగుదల, కాలుష్యాన్ని తగ్గించేందుకు మెకానికల్ స్వీపింగ్, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రీన్‌బెల్ట్ అభివృద్ధి, డంపింగ్ సైట్ల నుంచి పొందిన భూమిని పచ్చని ప్రదేశంగా మార్చడం, చక్కని ట్రాఫిక్ విధానాలను బాగా చేపట్టడం వల్ల ఈ నగరాలు/పట్టణాలను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. 2024 నాటికి కాలుష్యాన్ని 20-30 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో భారత్ 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ (ఎన్ఏసీపీ) కార్యక్రమాన్ని చేపట్టింది. తర్వాత ఆ లక్ష్యాన్ని సవరిస్తూ దానిని 2026 నాటికి 40 శాతం సాధించాలని నిర్ణయించారు. 2011-2015 మధ్య జాతీయ పరిసర నాణ్యతా ప్రమాణాల్ని అందుకోవడంలో క్రమం తప్పకుండా విఫలమవుతున్న 131నగరాలను దీని పరిధిలోకి తెచ్చారు.