Parliament Special Session | కేంద్రం ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే, సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జమిలి ఎన్నికల కోసమే ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నదన్న వార్తలు వచ్చాయి. ప్రత్యేక సమావేశాలకు ఎందుకో చెప్పాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో కేంద్రం బుధవారం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు సంబంధించిన అజెండాను విడుదలయ్యాయి.
లోక్‌సభ, రాజ్యసభ వేర్వేరుగా బులిటెన్‌ను విడుదల చేసింది. 75 సంవత్సరాల పార్లమెంటరీ ప్రయాణంపై చర్చించనున్నట్లు బులిటెన్‌లో పేర్కొంది. అలాగే జెండాలో నాలుగు బిల్లులను సైతం కేంద్రం ప్రస్తావించింది. ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023తో పాటు వివాదాస్పద ఎన్నికల కమిషనర్‌కు సంబంధించిన బిల్లులను ప్రస్తావించింది. అయితే, ఉమ్మడి పౌరస్మృతిపై కేంద్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఐదురోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు ముందురోజు అఖిపక్ష సమావేశాన్ని సైతం కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రశ్నోత్తరాల సమయం, ఇతర కార్యకలాపాలు ఉండవని స్పష్టం చేసింది. మరో వైపు ఇటీవల కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల సమావేశానికి సంబంధించిన ఎజెండా ఏంటో చెప్పాలని ప్రధానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రత్యేక సమావేశాల్లో దేశ ఆర్థిక పరిస్థితి, కుల గణన, చైనా, అదానీ గ్రూప్‌తో పాటు సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై చర్చించాలని డిమాండ్ చేశారు.