NGREGS | న్యూఢిల్లీ: గ్రామాల్లోని పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకా’నికి (ఎంజీఆర్ఈజీఎస్) కేంద్రం పాతరేస్తున్నది. ఒకవైపు బడ్జెట్లో ఏటా భారీగా నిధులకు కోతపెడుతున్న మోదీ సర్కారు.. మరోవైపు ఆధార్ ఆధారిత చెల్లింపులు, ఇతరత్రా నిబంధనలతో పేదలను ఈ పథకానికి దూరం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. పథకంలో భాగంగా కూలీలకు వేతనాల చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం జాబ్ కార్డు, బ్యాంకు ఖాతాకు ఆధార్ లింకింగ్‌ను తప్పనిసరి చేసింది. ఇందుకు సెప్టెంబర్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. అదేవిధంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) మ్యాపర్‌కు బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉండాలి. అయితే దేశంలో ఇప్పటికీ 57.75 శాతం మంది ఉపాధి కార్మికులు మాత్రమే ఆధార్ ఆధారిత చెల్లింపునకు(ఏబీపీఎస్) అర్హులుగా ఉన్నారు. దీంతో వేతనాల చెల్లింపు విషయంలో మిగతా వారి పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతున్నది.
దేశంలో 27 కోట్ల కార్మికులు
ఏబీపీఎస్ విధానాన్ని ఉపాధి హామీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లిబ్టెక్ ఇండియా సంస్థ డాటా ప్రకారం.. దేశంలో ఈ ఏడాది ఆగస్టు 21 నాటికి 26.84 కోట్ల మంది ఉపాధి హామీ కార్మికులు ఉండగా, వారిలో 57.75 శాతం మంది మాత్రమే ఆధార్ ఆధారిత చెల్లింపు వ్యవస్థకు అర్హులుగా ఉన్నారు.
ఇది పని హక్కును నిరాకరించడమే..
ఏబీపీఎస్ అర్హత పేరుతో ఉపాధి హామీ చెల్లింపులను నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని నరేగా సంఘర్ష్ మోర్చా నేత నిఖిల్ అన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధార్ ఆధారిత చెల్లింపునకు అర్హులైన యాక్టివ్ లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే చూస్తున్నదని, దేశంలోని మొత్తం కార్మికులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. యాక్టివ్ కార్మికుల్లో కూడా దాదాపు 20 శాతం మంది ఏబీపీఎస్‌కు అర్హులుగా లేరన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. నాన్ యాక్టివ్ కార్మికులను విస్మరించడం ద్వారా కేంద్రం వారి పని హక్కును నిరాకరిస్తున్నదని లిబ్టెక్ ఇండియాకు చెందిన లావణ్య తమాంగ్ అభిప్రాయపడ్డారు. సరైన మార్గదర్శకాలు లేనందున ఏబీపీఎస్‌కు అర్హులుగా లేని వారి జాబ్‌కార్డులను అధికారులు తొలగిస్తున్నారని పేర్కొన్నారు.