న్యూఢిల్లీ, మార్చి 16: కొత్త రైల్వే లైన్ల నిర్మాణంలో కేంద్రప్రభుత్వం దక్షిణ భారత రాష్ర్టాల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తున్నదని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. మాట్లాడితే ‘ఒకే దేశం’ అని ప్రచారం చేసుకొనే కేంద్రంలోని బీజేపీ సర్కారు నిధుల కేటాయింపులో మాత్రం ఉత్తర, దక్షిణ రాష్ర్టాలను విడదీసి చూస్తున్నదని విమర్శించారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం కోసం ప్రస్తుత బడ్జెట్లో ఉత్తరాది రైల్వేకు రూ.13,200 కోట్లు కేటాయించగా, దక్షిణాది రైల్వేకు కేవలం రూ.59 కోట్లు ప్రతిపాదించడంపై కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం లోక్సభలో రైల్వే మంత్రిత్వ శాఖ డిమాండ్లు, గ్రాంట్లపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా కనిమొళి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. బీజేపీని నిలదీశారు. రైల్వేల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉండటంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో దక్షిణ భారత రాష్ర్టాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదన్నారు. రైల్వేను 2023కల్లా పూర్తిగా విద్యుదీకరిస్తామన్న కేంద్రం ప్రకటనపై కూడా ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రస్తుతం 73% లైన్లకే విద్యుత్తు సౌకర్యం ఉండగా.. ఒక్క ఏడాదిలోనే 100% లక్ష్యాన్ని ఎలా సాధిస్తారని అడిగారు. కనిమొళి మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.