పోదనలో లంకా దహనం తోలుబొమ్మలాటకు కళాకారులు సిరిసత్తి అనుమతి తీసుకుంటారు. చిలుకవాడలో సౌగంధికను, వామదేవుణ్ని బంధ విముక్తులను చేసిన పోటిసుడు.. ఒక భూగృహం వద్దకు చేరుకుంటాడు. కళింగలో ఈసాణుడు కుసుమ శ్రేష్ఠికి తన మనుషులు చేసిన దుర్మార్గాలను గురించి ఉన్నవీ లేనివి చెబుతుంటాడు. ఆ తర్వాత..
మునిపల్లెలో సమావేశం తర్వాత మాధవుడు తన శిష్యులను జాగృతపరిచినాడు. “బుద్ధుని మహోన్నత చింతన, శాంతి స్థాపన, లోక కల్యాణ కార్యాచరణ ఈ లోకులకు తేలికగా అర్థం కావు. కొంచెం ధనం ఉన్నా జీవితాన్ని విలాసవంతంగా గడిపేందుకు మనుషులు ఆరాటపడుతున్నారు. సంపద వైభవం అని, స్త్రీ సాంగత్యమే స్వర్గమని ఆశాపాశ వశులై, ఆవేశమతులై కోరికల దారాలను పట్టుకొని నిజమైన సుఖాన్ని చేరుకోలేక మాటిమాటికీ అధఃపాతాళంలో కూరుకొని పోతున్నారు. ఈ పరిస్థితిని మార్చాలంటే మనుషుల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకొని రావాలి. “మార్పు అంటే మనుషులందరినీ బౌద్ధ సన్యాసులుగా మార్చడం కాదు. అది సాధ్యమయ్యేదీ కాదు. ఇతరులకు అపకారం చేయకుండా, ఇతరులను బాధ పెట్టకుండా జీవించే విధానం శ్రేష్టమైందని వాళ్లు అర్థం చేసుకునేటట్లు చెప్పాలి. పరోపకారం, ఇతరుల పట్ల చూపే ప్రేమ, దీనుల పట్ల చూపించే దయ ద్వారా లభించే సంతృప్తి విలువ వాళ్లు గ్రహించేటట్లు చేయాలి. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వహించడంలోని గొప్పతనం గురించి బోధించాలి. మనసును అదుపులో పెట్టుకోవడం వల్ల కోరికలను జయించ వచ్చునని, అందుకు ధ్యానమే సరైన మార్గమని మనం చేసి చూపించి, వాళ్లకు అనుభవంలోకి వచ్చేటట్లు చేయాలి. ఇవన్నీ మనం చిత్తశుద్ధితో చేయాలి. అందరినీ ప్రేమతో చూడాలి. ఆ ప్రేమ కోరికలకు అతీతంగా, కరుణతో కూడినదై ఉండాలి. మనుషులందరూ సమానమన్న భావనను వ్యాపింపజేయాలి” అంటూ..
తాము నడుచుకోవాల్సిన విధివిధానాలను గురించి వివరించి, శ్రమణకులందరినీ వివిధ మార్గాలలో పంపినాడు మాధవుడు. వాళ్లలో కొందరు రాజదర్శనాలకు; కొందరు ఇతర దేశాలకు; అత్యధికులు గ్రామాలకు వెళ్లినారు. గ్రామీణుల్లో మార్పు దేశంలో మార్పునకు దోహదం చేస్తుందని మాధవుని నమ్మకం. ఆ విధంగా సానందుడుగా మారిన ప్రణాళుడు కూడా ఊరిబాట పట్టినాడు. నిజానికి మాధవుడు అతణ్ని రాజదర్శనం కోసం వెళ్లుమన్నాడు కానీ, ప్రణాళుడే తాను ఇంకా పరిణతి చెందవలసి ఉన్నదని, అంతవరకు గ్రామసీమల సంస్కార మార్గమే తనకు తగినదని, ఆ మార్గం ఎంచుకున్నాడు. అట్లా ఒక ఊరి నుంచి మరొక ఊరికి మారుతూ, తరచూ మాధవుని బోధనలను మననం చేసుకుంటున్నాడు ప్రణాలుడు. అప్పుడే అతనికి తన గురువు గొప్పతనం గుర్తుకొచ్చింది. ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ సమచిత్తులై వ్యవహరించే మాధవ శ్రమణకులు ఉత్తములలో ఉత్తములు కదా! అని ఈ విధంగా తలపోసినాడు..
కీడు గలుగు వేళ పీడన నందరు;
భయములందున వెరువరు; ధనమ్ము
కలుగునట్టి వేళ గర్వితులును గారు;
చిత్త సమత కలిగి యుత్తము లిల!
(ఈ లోకంలో సమచిత్తం కలిగిన మహానుభావులు ఆపదల్లో ఒత్తిడికి లోను కారు; భయం చేత ధైర్యాన్ని కోల్పోరు; సంపద కలిగినప్పుడు గర్వాన్ని దరి చేరనీయరు)
మంచి ఆలోచనలతో, ఆత్మ నిగ్రహంతో ముందుకు వెళుతున్న సానందుడు ఆ ఊర్లో విషమ పరీక్షను ఎదుర్కోబోతున్న విషయం మాత్రం అతనికి తెలవదు.
తోలుబొమ్మలాట ప్రదర్శన విషయం ఆ చుట్టుపక్కల వారికి క్షణాల్లో తెలిసిపోయింది. ఆనాటి సాయంత్రానికి ఇంకా చాలామందికి తెలిసింది. నిజానికి ప్రదర్శకులు సాధ్యమైనంత తక్కువ మందిని పిలవాలని, శ్రేష్ఠి పరివారం మాత్రం అందరూ ప్రదర్శనకు వచ్చేటట్లు చూసుకోవాలని అనుకున్నారు. అందుకే ప్రచారం చేయలేదు కానీ కర్ణాకర్ణిగా వ్యాపించే సమాచార శక్తిని అడ్డుకోగలిగే యుక్తి కూడా వాళ్లకు లేదు కదా! అస్మక రాజు సౌరిసంబ కంటే తాను అధికుడనని అనిపించుకోకూడదని పోదన నగరంలో ఓ చివరన కుసుమ శ్రేష్ఠి తండ్రి సుజన శ్రేష్ఠి నిర్మించిన కోట లాంటి భవనం అది. అక్కడ అంతా కుసుమ శ్రేష్ఠి ఇంట పని చేసేవాళ్లు; వ్యాపారంలో భాగస్వాములు; వ్యాపార చర్యలో పాలుపంచుకునే వాళ్లు; బంధుమిత్రులు; వాళ్ల సౌకర్యాలు చూసుకునే వాళ్లు; చిన్న వ్యాపారులు తదితరులతో రాజధానికి కొంచెం దూరంగా, ప్రత్యేక ఆకర్షణగా ఉండే చిన్నకోటలాంటి గృహ సముదాయం అది. ఆ కోట ఆవరణలోనే ప్రదర్శన ఏర్పాటు చేసినారు కళాకారులు. అట్లా అయితేనే పరివారం అంతా తప్పక చూడగలరని నిర్వాహకుల ఆలోచన. తోలుబొమ్మలాట ప్రదర్శకులు ఈసాణుడి మనుషుల గుప్పిట్లో ఉన్నారు. తోలుబొమ్మలను సారణుడి బృందం ఆడిస్తుంది. సారణుడి బృందాన్ని ఆడిస్తున్న వాళ్లు మాత్రం ఈసాణుడి మనుషులు. వీళ్ల నాయకుడు కల్లణసీహుడు. ఇతను ఈసాణుడికి నమ్మినబంటు. తంత్ర విద్యా ప్రవీణుడు. మహేంద్రజాల కళలో నిష్ణాతుడు. కుసుమ శ్రేష్ఠి కోటను కొల్లగొట్టి, అందమైన ఆడవాళ్లందరినీ కళింగకు తరలించడం వాని ప్రధాన లక్ష్యం. అందులో మరీ ముఖ్యంగా కుసుమ శ్రేష్ఠి భార్య సిరిసత్తిని, కోడలు రోహాదేవిని తప్పకుండా తీసుకొని రమ్మని ఈసాణుడి ఆదేశం.
ప్రదర్శనను ప్రారంభిస్తూ కల్లణసీహుడు.. “మహాజనులారా! ఇంతవరకూ మీరు కనీవినీ ఎరుగని ప్రదర్శనను ఇప్పుడు చూడబోతున్నారు. మీరంతా ఒక పవిత్రమైన అనుభూతిని చెందుతారు. ప్రస్తుతం మీరు పోదన నగరం నుంచి సాక్షాత్తు లంకా నగరానికి వెళుతున్నారు. నిజం! ఇది నిజంగా మీ అనుభవంలోకి రావాలంటే అందరూ నేను చెప్పినట్లు వినాలి. అప్పుడే ఆ అద్భుతమైన అనుభూతిని ఆస్వాదించగలరు. అందరూ కళ్లు మూసుకోండి!” అని ఆదేశించినాడు. ఆ అనుభూతిని నిజంగా ఆస్వాదించాలని ప్రేక్షకులందరూ కళ్లు మూసుకున్నారు. ప్రదర్శన రాణివాసానికి అనుకూలంగా ఉండాలని, బాగా కనిపించాలని కోటలో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఏర్పాటు చేసినారు. పై అంతస్తులో కూర్చున్నారు సిరిసత్తి, రోహ, అలసుద్ది. వాళ్లకు కొద్ది దూరంలో అణులచ్చి, మరి కొంతమంది పరిచారికలు ఉన్నారు. విశ్వసనీయులైన నలుగురు భటులను వేర్వేరు స్థలాల్లో కాపలా పెట్టి, కువిందుడు ఒక మూలన నిలబడి అన్నీ గమనిస్తున్నాడు. ఈ ఐదుగురు తప్ప అక్కడ ఉన్న వాళ్లందరూ కల్లణసీహుని ఆదేశాన్ని అనుసరించి కళ్లు మూసుకున్నారు. అతను తన ప్రసంగం కొనసాగిస్తూ.. “మీరు పూర్తిగా ఈ ప్రదర్శనలో లీనం కావాలంటే, నేను చెప్పేదంతా యథాతథంగా అనుసరించాలి; మనఃపూర్వకంగా ప్రవర్తించాలి. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.. మరేమీ వినపడటం లేదు. నేను మిమ్మల్ని అలనాడు రావణాసురుడు ఉపయోగించిన పుష్పకవిమానంలో కూర్చోబెట్టుకొని లంకానగరం వద్ద గల త్రికూట పర్వతానికి తీసుకొని పోతున్నాను. భయపడకండి! నా మాటలు వింటున్నంత సేపు మీకు ఏ భయమూ కలగదు. ఒక్కసారి ‘జైశ్రీరామ్!’ అనండి!” అన్నాడు, వాళ్ల ప్రతిస్పందన కోసం చూస్తూ.

అందరూ “జైశ్రీరామ్!” అన్నారు. వాళ్లంతా బిగ్గరగా అన్నామనుకున్నారు కానీ.. వాళ్ల మాట వాళ్లకే వినిపించనంత స్థాయిలో అన్నారు. అది గమనించిన కల్లణసీహుడు.. “ఇంకా బిగ్గరగా.. ఇంకా బిగ్గరగా.. ఇంకా బిగ్గరగా”.. అని మూడుసార్లు అన్నాడు. వాళ్లు గొంతు పెంచి అన్నారు. వాళ్లకు మాత్రం ఆ మాట చెవులు పగిలిపోయేటంత గట్టిగా అరిచినట్లు అనిపించింది; బయటికి మామూలుగానే వినిపించింది.. కానీ, అందరూ కల్లణసీహునికి ఆధీనులైనారు. అప్పుడతను ‘బొ..య్…’ అంటూ పుష్పకవిమానం వస్తున్నట్లు శబ్దం చేస్తూ.. “అదిగో! పుష్పక విమానం.. కంగారు పడకండి! తొందర పడకండి! ఎంతమంది ఎక్కినా అందులో స్థలం సరిపోతుంది. ఒక్కొక్కరుగా ఎక్కండి.. నెమ్మదిగా.. నెమ్మదిగా.. బాగు బాగు.. ఇదీ పద్ధతి.. మీరంతా చాలా మంచివాళ్లు.. అందరూ ఎక్కేసినారా.. పెద్దమ్మా.. నీవు కూడా ఎక్కు.. అన్నా! కొంచెం ఆ తల్లికి సాయం చెయ్..” అని అంటుంటే.. అందరూ కూర్చున్న చోటనే అతను చెప్పినట్లు తు.చ. తప్పకుండా చేయసాగినారు. సంతృప్తుడైనాడు కల్లణసీహుడు. “ఇక బయలుదేరుదాం. అందరూ మరోమారు ‘జైశ్రీరామ్!’అనండి” అన్నాడు. అందరూ గట్టిగా అన్నారు.
బొ..య్యి..మని శబ్దం చేస్తూ పుష్పక విమానం బయలుదేరింది. “ఏం భయపడకండి! ఆకాశంలో చాలా ఎత్తుకు వచ్చినాం. అయినా మనకు ఏం కాదు! కూర్చున్న చోటు నుంచే కదలకుండా చూడండి! చుట్టూ తెల్లని మబ్బులు ఉన్నాయి.. పైన నల్లటి ఆకాశం.. చల్లని గాలి వీస్తుంది..” అని కల్లణసీహుడు అంటూ ఉంటే.. అందరూ వాటిని అనుభూతించసాగినారు. కొద్దిసేపైన తర్వాత అన్నాడు.. “ఇదిగో! ఇదే త్రికూట పర్వతం. ఇక్కడి నుంచే శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధం చేసి గెలిచినాడు. అందరూ నెమ్మది నెమ్మదిగా కిందికి దిగండి! దిగిన తర్వాత మెల్లమెల్లగా కళ్లు తెరవండి.. తెరిచినారా?.. మీ ఎదురుగా అందమైన వేదిక. ఆ వేదిక మీదనే లంకా దహనం తోలుబొమ్మలాట ప్రదర్శన జరుగుతున్నది. ఇక ఈ ఆటను ఆస్వాదించండి..” అన్నాడు కల్లణసీహుడు. అందరూ అతిప్రయత్నం మీద కళ్లు తెరిచి, ఎదురుగా ఉన్న తెర ముందు ఆంజనేయస్వామి సముద్రం దాటి లంక వైపు వెళుతుండటం ఆశ్చర్యంగా చూడ సాగినారు.
“మీరు పూర్తిగా ఈ ప్రదర్శనలో లీనం కావాలంటే, నేను చెప్పేదంతా యథాతథంగా అనుసరించాలి; మనఃపూర్వకంగా ప్రవర్తించాలి. మీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి.. మరేమీ వినపడటం లేదు. నేను మిమ్మల్ని అలనాడు రావణాసురుడు ఉపయోగించిన పుష్పకవిమానంలో కూర్చోబెట్టుకొని లంకానగరం వద్ద గల త్రికూట పర్వతానికి తీసుకొని పోతున్నాను. భయపడకండి! నా మాటలు వింటున్నంత సేపు మీకు ఏ భయమూ కలగదు. ఒక్కసారి ‘జైశ్రీరామ్!’ అనండి!” అన్నాడు, వాళ్ల ప్రతిస్పందన కోసం చూస్తూ. అందరూ “జైశ్రీరామ్!” అన్నారు. వాళ్లంతా బిగ్గరగా అన్నామనుకున్నారు కానీ.. వాళ్ల మాట వాళ్లకే వినిపించనంత స్థాయిలో అన్నారు.