హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిభకు పేదరికం అడ్డుకాదని వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఆదివాసి మహిళా క్రికెటర్ తాటి కృష్ణవేణి చేతల్లో చూపెట్టింది. బీసీసీఐ ఆధ్వర్యంలో జార్ఖండ్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నీలో కృష్ణవేణి సత్తాచాటింది. హైదరాబాద్ తరఫున బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో రాణించింది.
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ల్లో జరిగిన అంతర్ జిల్లాల మహిళా క్రికెట్ టోర్నీలో కృష్ణవేణి ఆల్‌రౌండ్ ప్రతిభతో అదరగొట్టింది. ఇదిలా ఉంటే నగరంలోని బడంగ్‌పేట్‌లోని పటేల్ క్రికెట్ అకాడమీలో గత కొన్నేండ్లుగా శిక్షణ తీసుకుంటున్న ఈ ఆదివాసి క్రికెటర్ అంచలంచెలుగా ఎదిగింది. దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్‌ను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నది. కోచ్ జయానంద్ పటేల్ పర్యవేక్షణలో రాటుదేలిన కృష్ణవేణి భవిష్యత్‌లో హైదరాబాద్ తరఫున మరిన్ని విజయాల్లో పాలుపంచుకోవాలన్న పట్టుదలతో ఉంది.