‘పుస్తకం హస్తభూషణం’ అన్నది కాలం చెల్లిన మాట. స్మార్ట్‌ఫోన్ చేతికొచ్చాక బుక్ కల్చర్ పోయి, లుక్ కల్చర్ వచ్చింది. యువత నియంత్రణ లేని రీల్స్‌లో మునిగిపోయింది. షార్ట్స్‌లోనే విలువైన కాలం కరిగిపోతున్నది. సోషల్ మీడియా వచ్చి.. సోషల్ లైఫ్‌కి అడ్డుగోడ కట్టింది. ఈ అగాధాన్ని దాటేందుకు కేయూ విద్యార్థులు చేయిచేయి కలిపి ముందుకు నడిచారు. అరల్లో చిక్కుకొని అంధకారంలో కొట్టుమిట్టాడుతున్న పుస్తకాలతో.. సామాన్యులు నడిచే తోవలో ‘లుక్ ఏ బుక్’ పేరుతో వీధి గ్రంథాలయం మొదలుపెట్టారు. తెలంగాణలో మళ్లీ మొగ్గతొడిగిన వట్టికోట ఆళ్వారుస్వామి వారసత్వం.. కాకతీయలో మొదలై, ఇతర విశ్వవిద్యాలయ ప్రాంగణాలకేకాదు గ్రామాలకూ విస్తరిస్తున్నది!
‘మా ఊళ్లో గ్రంథాలయం ఏర్పాటు చేయండి’ అంటూ అధికారులకు దరఖాస్తులు వస్తుంటాయి. పుస్తకాలు చదవాలని, అందుబాటులో ఉంచాలన్న కోరిక బాగానే ఉంది. అయితే, అప్పటికే గ్రంథాలయాలు ఉన్న ఊళ్లల్లో పుస్తకాలు చదివేందుకు ఆసక్తి ఉండదు. దుమ్ముపట్టిన పుస్తకాలు, ఖాళీ కుర్చీలతో గ్రంథాలయాలు వెలవెలబోతున్నాయి. అందని దానిపట్ల ఆకర్షణ, అందితే నిర్లక్ష్యం చాలా సహజం. విద్యార్థులూ ఇలాగే ఉన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. పుస్తకాలు మాత్రం పరీక్షలప్పుడే చదువుతుంటారు. పాఠ్యపుస్తకాలే చదవని తరాన్ని పుస్తకం పట్టించి చదివించడం చాలా కష్టం. ఇక గ్రంథాలయాలకు రప్పించడమంటే మాటలు కాదు. కాబట్టి.. ‘వాళ్లున్న చోటుకే పుస్తకాలు తీసుకుపోదాం. వాళ్లకు ఇష్టమైన పుస్తకాలు పట్టిద్దాం’ అని కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు హాథిరామ్ సభావట్, వంశీకృష్ణ, శివ నాస్తిక్, అమర్నాథ్, జాహ్నవి, ఉదయ్ కిరణ్ అనుకున్నారు. వీళ్లంతా క్లాస్మేట్స్ కాదు. సైన్స్, సోషల్, ఇంజినీరింగ్.. వేర్వేరు శాస్ర్తాలు చదివే విద్యార్థులు. వాళ్లందరి అభిరుచి ఒక్కటే. పుస్తక పఠనం.
చూడండి.. నచ్చిన పుస్తకం చదవండి!
సాహిత్యాన్ని ఇష్టపడే విద్యార్థులు కలిసి యూనివర్సిటీలో ఓ సాహితీ వేదికను ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ ప్రయత్నంలో దానికంటే ముందు పాఠకుల్ని తయారు చేయాలనుకున్నారు. వైఫై రూటర్లకు దగ్గరగా ఉన్న యూత్‌ని గ్రంథాలయాల దాకా తీసుకుపోవడం మాటలుకాదు. కాబట్టి స్మార్ట్‌ఫోన్ చూడటం తప్ప పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపని విద్యార్థుల కోసం యూనివర్సిటీ రోడ్ల పక్కన ఫుట్‌పాత్‌పై పుస్తకాలు పరిచారు. వీధిలోకి వచ్చిన గ్రంథాలయాన్ని చూసి వచ్చేపోయే విద్యార్థులను కాసేపు ఆపగలిగారు. నిర్వాహకులు పలకరిస్తూ.. ‘మీ కోసమే ఈ పుస్తకాలు. వచ్చి చదవండి’ అంటూ ఆహ్వానించారు. తాము చదువుకునేందుకు కొనుక్కున్న పుస్తకాలను అందరూ చదివేందుకు ఆ విద్యార్థులు వీధుల్లోకి తీసుకురావడంతో పాదచారులు ఆశ్చర్యపోయారు. ఓ ఐదు నిమిషాలు తిరిగేద్దామంటూ తెరిచిన పుస్తకాన్ని ఆసక్తిగా చదివి.. ‘బాగుంది మీ ఐడియా’ అంటూ కితాబిచ్చి వెళ్లారు. ఈ వీధి గ్రంథాలయాన్ని చూసి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, బయటి నుంచి వాకింగ్‌కి వచ్చే పెద్దలూ మెచ్చుకున్నారు. చిన్న పిల్లలు చేసిన చిన్న ప్రయత్నాన్ని మెచ్చుకుని పెద్ద ఉద్యమంలా మారాలని ఆశీర్వదించారు.

యూనివర్సిటీల్లో గ్రంథాలయోద్యమం
ఏడాది కిందట ఏప్రిల్ 21న ప్రారంభమైన వీధి గ్రంథాలయం మూడు వారాలు విజయవంతంగా నడిచింది. ఆ విద్యార్థుల ప్రయత్నాన్ని అభినందించిన కొందరు రచయితలు మరిన్ని పుస్తకాలు ఇచ్చి మరింతమందికి చేరువచేయడానికి సాయపడ్డారు. పుస్తకాలు పెరిగినట్టే ఈ వీధి గ్రంథాలయం విశ్వవిద్యాలయ ప్రాంగణం దాటి పురవీధుల్లోకి అడుగుపెట్టింది. నాలుగోవారం హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో కూడా వీధి గ్రంథాలయం నిర్వహించారు. నగర ప్రజలు అభిమానించి ఆదరించడంతో అక్కడ రెండు నెలలపాటు వారంవారం ఏర్పాటుచేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో ‘లుక్ ఏ బుక్’ నిర్వాహకుల్లో ఒకరైన హాథిరామ్ .. స్థానికుల సహకారంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాగణంలోనూ లుక్ ఏ బుక్ నిర్వహించ తలపెట్టారు. అయితే, బయటివాళ్లు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు, ఆటంకాలు ఎదురయ్యాయట. శ్రీకాంత్ ఓయూ, సాగర్ యువక మద్ధతుతో ఆ సమస్య తీరిపోయిందని, ఇక ఆ తర్వాత ఏ సమస్యా రాలేదని హాథిరామ్ చెప్పారు.
పరీక్షల తర్వాత వేసవి సెలవులు వచ్చాయి. చదువు అయిపోయాక ఎవరి దారిన వాళ్లు ఇళ్లకు వెళ్లిపోయారు. కేయూలో లుక్ ఏ బుక్ నిర్వహణ కోసం మరో బృందం ఏర్పడింది. వంశీకృష్ణ, జ్యోతి, శివ, ఊహిత, బిక్సిత్, నీలం వైష్ణవి మరికొంతమంది సభ్యులుగా ఉన్న ఈ బృందం ఒక భావజాలాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో కాకుండా అన్ని భావజాలాలనూ పాఠకులకు చేరువ చేయాలని అనుకున్నారు. అందుకు తగ్గట్టుగా రకరకాల పుస్తకాలను విద్యార్థులు, ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీలోనూ లుక్ ఏ బుక్ నిర్వహణ కోసం అక్కడి విద్యార్థులు ముందుకు వచ్చారు. కవి యాకుబ్ అందించిన పుస్తకాలతో దండు కొండల్, అర్బజ్ తెలంగాణ యూనివర్సిటీలో లుక్ ఏ బుక్ నిర్వహణకు నాయకత్వం వహిస్తున్నారు.
పల్లెల్లో పుస్తకాల వెలుగులు
తెలంగాణ సాయుధ పోరాట కాలంలో వట్టికోట తట్టలో గ్రంథాలు పెట్టుకుని ఉద్యమంలా ఊరూరూ తిరిగినట్టు.. లుక్ ఏ బుక్ బృందాన్ని పల్లెలు ఆహ్వానించాయి. మహబూబాబాద్ జిల్లాలోని అర్పనపల్లి గ్రామంలో వీధి గ్రంథాలయం నిర్వహించాలని గ్రామస్తులు ముందకు వచ్చారు. లుక్ ఏ బుక్ బృందం వారికి కొన్ని పుస్తకాలు ఇచ్చి సహకరించింది. దాతలు ఇచ్చిన పుస్తకాలతో గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో రెండు వారాలకు ఒకసారి వీధి గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. ఈ గ్రంథాలయ నిర్వహణ కోసం గ్రామస్తులు ఒక కమిటినీ ఏర్పాటు చేసుకున్నారు. అర్పనపల్లి గ్రామ ప్రజల స్ఫూర్తితో మహబూబాబాద్, కాగజ్ నగర్‌కు సమీపంలోని ఆరు గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి లుక్ ఏ బుక్ బృందాన్ని సంప్రదించారు. కోఠీ మహిళా విశ్వవిద్యాలయ విద్యార్థిని మమత హైదరాబాద్‌లో ఓపెన్ లైబ్రరీ నిర్వహిస్తూ సామాజిక అభివృద్ధికి సాహిత్యాభిలాష పెంపొందించేందుకు పాటుపడుతున్నది. అలా, తెలంగాణ పల్లెల్లో గ్రంథాలయోద్యమం 2.0కు బాటపడుతున్నది.
– రోహన్