న్యూఢిల్లీ, జనవరి 27: ప్రధాని నరేంద్రమోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా కేంద్రప్రభుత్వం తీవ్ర నిర్బంధాలు విధిస్తున్నది. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శించినా, చూసినా విద్యార్థులను అరెస్టు చేస్తున్నది. పోలీసులు క్యాంపస్‌లలోకి వెళ్లి మరీ విద్యార్థులను నిర్బంధిస్తున్నారు. పదిమంది ఒక్కచోట చేరినా అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలిస్తున్నారు. డాక్యుమెంటరీని వ్యక్తిగతంగా కూడా చూడకుండా విద్యుత్తు, ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తున్నారు. మోదీ సర్కారు ఎన్ని నిర్బంధాలు పెట్టినా డాక్యుమెంటరీని ప్రదర్శించే తీరుతామని విద్యార్థులు తెగేసి చెప్తున్నారు.
అంబేద్కర్ వర్సిటీలోకి పోలీసులు
ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీలో పోలీసులు శుక్రవారం హడావిడి చేశారు. కొందరు విద్యార్థులు బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శిస్తున్నారన్న సమాచారం అందటంతో, క్యాంపస్‌లోకి వెళ్లి సోదాలు నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో డాక్యుమెంటరీని ప్రదర్శించకుండా వర్సిటీ యాజమాన్యం విద్యుత్తు సరఫరాను నిలిపేసిందని విద్యార్థులు తెలిపారు. అయినా, వ్యక్తిగతంగా విద్యార్థులకు డాక్యుమెంటరీ లింకులను పంపుతున్నామని, సొంత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో చూసుకోవచ్చని చెప్పారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయమే వర్సిటీ నార్త్ క్యాంపస్‌లో వందలమంది పోలీసులను మోహరించారు. విద్యార్థులు గుమికూడకుండా చెదరగొట్టారు. ఆర్ట్స్ ఫ్యాకల్టీ భవనం వద్ద డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ప్రయత్నించిన 24 మంది విద్యార్థులను అరెస్టు చేశారు. కాగా, పశ్చిమబెంగాల్లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో బీబీసీ డాక్యుమెంటరీని శుక్రవారం ప్రదర్శించగా భారీ సంఖ్యలో విద్యార్థులు తిలకించారు. డాక్యుమెంటరీ ప్రదర్శన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకోవటంతో యూపీలోని జామియా మిలియా వర్సిటీలో శుక్రవారం కూడా తరగతులను రద్దుచేశారు.