Pakistan Airbase | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): భారత సైన్యం చేతిలో పాకిస్థాన్‌కు మరో చావుదెబ్బ తగిలింది. ఇస్లామాబాద్, రావల్పిండి, కరాచీతో పాటు దక్షిణ పంజాబ్, లాహోర్, సియాల్కోట్కు సమీపంలోని ఎనిమిది ఎయిర్ బేస్లే లక్ష్యంగా భారత సైన్యం శనివారం మెరుపు దాడులకు దిగింది. శుక్రవారం రాత్రి దాయాది దేశం డ్రోన్, శతఘ్నులతో చేపట్టిన దాడులకు ప్రతిచర్యగా ఈ దాడులు చేపట్టినట్టు శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్రం వెల్లడించింది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాక్, పీవోకేలోని 9 ఉగ్ర శిబిరాలను భారత్ పేల్చేసింది. ఎప్పటినుంచో ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్.. ఈ చర్యతో రగిలిపోయింది. భారత్‌ను దొంగదెబ్బ తీయడానికి సరిహద్దు ప్రాంతాలపై కాల్పులు, దాడులకు తెగబడుతున్నది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి, తెల్లవారుజామున బారాముల్లా నుంచి భుజ్ వరకు 26 ప్రాంతాల్లోని సైనిక స్థావరాలు, జనావాసాలపై వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడింది. సరిహద్దుల్లో శతఘ్నులతో విరుచుకుపడింది. దీంతో పాక్ దాడులను తిప్పికొట్టిన భారత త్రివిధ దళాలు.. దాయాది దేశంలోని పలు వైమానిక, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులను ప్రారంభించాయి.
భారత సైన్యం శనివారం ఉదయం పాక్ వైమానిక స్థావరాలతో పాటు సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో పాక్ ఆయుధ డిపోలు, రక్షణ సామగ్రి ధ్వంసమైనట్టు ఆర్మీ వర్గాలు తెలిపాయి. భారత సైన్యం చేసిన దాడిలో పాక్ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో పాక్ సైన్యం హైడ్క్వార్టర్స్ రావల్పిండిలో ఉండే చాక్లాలా ఎయిర్‌బేస్, ఆర్థిక కార్యకలాపాలకు కీలకమైన కరాచీ-హైదరాబాద్ మధ్యలో ఉండే సుక్కూర్ ఎయిర్‌బేస్‌తో పాటు చునియాన్, మురీద్, రహీమ్ యార్ ఖాన్, రఫీకీ, పస్రూర్, సియాల్కోట్ ఎయిర్‌బేస్‌లను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమయ్యాయి. ఆ ఎయిర్‌స్ట్రిప్‌లు ప్రస్తుతం వాడటానికి కూడా వీలులేకుండా తయారయ్యాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
దాడులు జరిగిన పాకిస్థాన్ వైమానిక స్థావరాలు
పేరు: చాక్లాలా ఎయిర్‌బేస్ (నూర్కాన్ ఎయిర్‌బేస్)
ప్రాధాన్యం: పాక్ సైన్యం హైడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిలో ఈ ఎయిర్‌బేస్ ఉంది. అంతేకాదు దేశ రాజధాని ఇస్లామాబాద్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందుకే ఈ ఎయిర్‌బేస్ రాజకీయంగా, సైనిక పరంగా ఎంతో సున్నితమైందిగా చెప్తారు. అన్ని ఎయిర్‌ఫోర్స్ ఆపరేషన్లకు ఈ వైమానిక స్థావరమే అడ్డా. ప్రధాని సహా వీఐపీల ప్రైవేట్ జెట్లు ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి.
పేరు: మురీద్ ఎయిర్‌బేస్
ప్రాధాన్యం: భారత సరిహద్దుల్లోని పలు ప్రాంతాలపై పాక్ జరిపిన డ్రోన్ దాడులన్నీ ఈ ఎయిర్‌బేస్ నుంచే ప్రధానంగా ప్రయోగించారు. షాహ్‌పర్-1, బాయ్క్త్రార్ టీబీ2 వంటి అత్యాధునిక యూఏవీ, యూసీఏవీ డ్రోన్లను ఈ బేస్ నుంచే ప్రయోగించారు. పాక్ చేపట్టే డ్రోన్ వార్ఫేర్ ప్రొగ్రామ్ మొత్తం ఇక్కడి నుంచే సాగుతుంది. రాడార్ ఇన్స్టాలేషన్, నిఘా వ్యవస్థ కూడా ఇక్కడ ఉన్నది.
పేరు: రఫీకీ ఎయిర్‌బేస్
ఎక్కడ: షోర్కోట్, పంజాబ్
ప్రాధాన్యం: జేఎఫ్-17 యుద్ధ విమానాలు, మిరాజ్ పైటర్ జెట్లు, సైన్యాన్ని తరలించే హెలికాప్టర్లకు ఈ బేస్ పెట్టింది పేరు. సెంట్రల్ పంజాబ్ మధ్యలో ఈ బేస్ స్టేషన్ ఉండటంతో తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు సైన్యం మోహరింపులో దీన్ని కీలకంగా పరిగణిస్తారు. భారత్‌పై వాడిన జేఎఫ్-17 యుద్ధ విమానాలను ఇక్కడి నుంచే ప్రయోగించారు.
పేరు: రహీమ్ యార్ ఖాన్
ఎక్కడ: రహీమ్ యార్ ఖాన్ సిటీ, దక్షిణ పంజాబ్
ప్రాధాన్యం: పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ మిలిటరీ సామగ్రి, ఆయుధాల గిడ్డంగి ఇక్కడే ఉన్నది. రాజస్థాన్‌లో జరిగిన దాడులన్నీ ఇక్కడి నుంచి చేసినవే. పాక్ ప్రాంతాల భద్రతను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు.
పేరు: సుక్కూర్ ఎయిర్‌బేస్
ఎక్కడ: కరాచీ-హైదరాబాద్ మధ్యలోని జామ్షోర్
ప్రాధాన్యం: పాక్ సదరన్ ఎయిర్ కమాండ్ ఇక్కడ ఉన్నది. డ్యుయల్ యూజ్ రాడార్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. ఎఫ్-16ఏ/బీ బ్లాక్ 15 ఏడీఎఫ్ యుద్ధ విమానాలు, 19 స్కాడ్రాన్లు ఇక్కడి ప్రత్యేకత. ఆపరేషనల్ కన్వర్షన్ యూనిట్ (వోసీయూ) ఇక్కడ ఉన్నది.
పేరు: చునియాన్ ఎయిర్‌బేస్
ఎక్కడ: చునియాన్, పంజాబ్
ప్రాధాన్యం: పాక్ ఎయిర్‌ఫోర్స్ ప్రైమరీ ఆపరేషనల్ బేస్‌గా దీన్ని పిలుస్తారు. రాడార్ టెక్నాలజీ డిపో ఉన్నది. లాహోర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న..ఈ ఎయిర్‌బేస్ ఎంతో కీలకం.
పేరు: సియాల్కోట్ ఎయిర్‌బేస్
ఎక్కడ: సియాల్కోట్, పంజాబ్
ప్రాధాన్యం: మిలిటరీ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉన్నది. యుద్ధ విమానాలకు, హెలికాప్టర్లకు స్థావరం. రాడార్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉన్నది.
పేరు: పస్రూర్ ఎయిర్‌బేస్
ఎక్కడ: పస్రూర్, పంజాబ్
ప్రాధాన్యం: ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండటంతో శత్రు దేశాల దాడులకు సంబంధించిన సమాచారం ఇక్కడి నుంచే మొదటగా వెలువడుతుంది. రాడార్ వ్యవస్థ కూడా ఉన్నది.