న్యూఢిల్లీ: దశాబ్ధాల కాలంగా పెండింగ్‌లో ఉన్న జనాభా లెక్కల ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు.అయితే జనాభా లెక్కల సమయంలో కుల గణన(Caste Census) కూడా చేపట్టాలా వద్దా అన్న కోణంలో ఆలోచిస్తున్నారు. ప్రత్యేకంగా కులం కోసం ఓ కాలమ్‌ను ఉంచాలని భావిస్తున్నారు. 2020లో ప్రారంభం కావాల్సిన జనాభా లెక్కింపు ప్రక్రియ.. కోవిడ్ వల్ల ఆలస్యమైంది. జనాభాను లెక్కించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియను త్వరలో చేపడుతామని, దానికి సంబంధించిన ప్రకటన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. జనాభా లెక్కల క్వశ్చనేర్లో కులం కోసం ప్రత్యేక కాలమ్ ఉంచాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కులం ప్రాతిపదికన లెక్కింపు చేపట్టాలని ఇటీవల విపక్షాలు బలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీలైన జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ ఆ డిమాండ్‌కు మద్దతు తెలిపాయి. 2029లో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా జనాభా లెక్కలు, కుల గణన ఆధారంగా అమలులోకి తీసుకురానున్నారు. రిజర్వ్ నియోజకవర్గాల గుర్తింపు ప్రక్రియలో కుల గణన కీలకం కానున్నది.