న్యూఢిల్లీ: స్వతంత్ర భారతదేశంలో మొదటి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కురువృద్ధుడు శ్యామ్ శరణ్ నేగి (106)కి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) రాజీవ్‌కుమార్ నివాళులర్పించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నేగి స్వగ్రామమైన కల్పాకు వెళ్లిన రాజీవ్ కుమార్.. అక్కడ నేగి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 2న శ్యామ్ శరణ్ నేగి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే అతడు వేసిన చివరి ఓటు అయ్యింది. దాంతో కలిపి నేగి తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి మొత్తం 34 సార్లు ఓటు వేసినట్లయ్యింది. ఓటరుగా నమోదైంది మొదలు ఒక్కసారి కూడా మిస్‌కాకుండా ఓటు వేసిన నేగిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సీఈసీ పేర్కొన్నారు.
కాగా, గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న నేగి.. ఇవాళ ఉదయం తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. నేగి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.