న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ఉభయ దేశాల మధ్య సంబంధాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 1954లో చైనాతో పంచశీల ఒప్పందం చేసుకోవడం కోసం అప్పటి భారత ప్రధాని నెహ్రూ ఎందుకు ఆసక్తి చూపారన్న విషయమై కొన్ని ఆసక్తికర అంశాలను జనరల్ చౌహాన్ వెల్లడించారు.
ఈ ఒప్పందంతో ఉత్తర సరిహద్దు వివాదం పరిష్కారమవుతుందని నెహ్రూ భావించగా చైనా మాత్రం వేరేగా ఆలోచించిందని ఆయన చెప్పారు. శుక్రవారం డెహ్రాడూన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో జనరల్ చౌహాన్ మాట్లాడుతూ టిబెట్‌ను చైనాలో భాగంగా గుర్తించడం వల్ల ఉత్తర సరిహద్దు సమస్యకు శాంతియుత పరిష్కారం లభిస్తుందని భారత్ భావించినట్లు సీడీఎస్ తెలిపారు.
టిబెట్ ప్రాంతంలో వాణిజ్య సంబంధాల కోసం కుదిరిన ఈ ఒప్పందం ఉభయ దేశాల మధ్య శాంతియుత సహజీవనం కోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించింది. పంచశీల ఒప్పందంపై అప్పటి ప్రధాని నెహ్రూ, చైనా ప్రధాని చై ఎస్లై సంతకాలు చేశారు. ఒకరి ప్రాదేశిక, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించడం, పరస్పర దురాక్రమణలకు పాల్పడకపోవడం, ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకపోవడం, సమానత్వం, పరస్పర ప్రయోజనం, శాంతియుత సహజీవనాన్ని ఈ ఒప్పందం ప్రతిపాదించింది. చైనా ఈ ఒప్పందానికి ఏనాడూ కట్టుబడి లేదని ఆయన అన్నారు.