CDSCO | హైదరాబాద్, జూన్ 24 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీవో) పేర్కొంది. దేశవ్యాప్తంగా తయారవుతున్న ఔషధాల్లో నాణ్యతాప్రమాణాలను పాటించడం లేదని తెలిపింది. ప్రాణాలను కాపాడే 50కి పైగా ఔషధాలు నాసిరకంగా ఉన్నట్టు వెల్లడించింది.
ఈ జాబితాలో సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే పారాసిటమాల్ 500 ఎంజీ, రక్తపోటును నియంత్రించే టెల్మిసార్టన్, దగ్గు సిరప్ కఫ్టిన్, నొప్పి నివారణకు వాడే డిక్లోఫెనాక్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, కాల్షియమ్ గోలీలు ఉన్నట్టు వివరించింది. నాసిరకం ఔషధాల్లో 22కు పైగా మందులు హిమాచల్ ప్రదేశ్‌లోని ఫార్మా కంపెనీల్లోనే తయారవుతున్నట్టు గుర్తించింది. దీంతో ఆ రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలి బాధ్యులైన ఫార్మా కంపెనీ ప్రతినిధులకు నోటీసులు జారీ చేసింది. నాణ్యతలేని ఔషధాలను వెంటనే మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవాలని ఆదేశించింది.
గుజరాత్‌లోని వఘోడియా, హిమాచల్‌లోని సోలాన్, రాజస్థాన్‌లోని జైపూర్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌తో పాటు అంబాలా, ఇండోర్, హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీల్లో తయారయ్యే మందుల నమూనాలను సేకరించిన సీడీఎస్‌సీవో అధికారులు వాటిని ల్యాబ్‌లో పరీక్షించి ఈ మేరకు రిపోర్ట్‌ను వెల్లడించారు. కాగా దేశంలో ఉత్పత్తయ్యే ప్రతీ మూడు ఔషధాల్లో ఒకటి హిమాచల్‌లోనే తయారవుతుంది.