భోపాల్: మధ్యప్రదేశ్‌కు చెందిన మోడల్ త్విషా శర్మ మరణం కేసులో కొత్త సంగతి తెలిసింది. ఆత్మహత్యకు కొన్ని గంటల ముందు ఆమె ఒక బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. హెడ్ మసాజ్ చేయించుకున్నది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. (Twisha at beauty parlour) మోడల్, నటి అయిన 33 ఏళ్ల త్విషా శర్మకు భోపాల్‌కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్‌తో ఆరు నెలల కిందట పెళ్లి జరిగింది. మే 12న ‘ఎక్స్ప్రెషన్ బ్యూటీ పార్లర్’కు ఆమె వెళ్ళింది. అక్కడ సుమారు మూడు గంటల పాటు ఉన్నది. సెలూన్లో విశ్రాంతి తీసుకుంటూ, తలకు మసాజ్ చేయించుకున్నట్లు సీసీటీవీలో కనిపించింది.
కాగా, ఆ తర్వాత భోపాల్‌లోని కటారా హిల్స్ ప్రాంతంలో ఉన్న అత్తవారింటికి త్విషా తిరిగి వచ్చింది. అనంతరం ఇంట్లో జిమ్నాస్టిక్ తాడుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది.
అయితే త్విషా శరీరంపై అనేక గాయాల గుర్తులున్నట్లు ఆమె కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం త్విషాను వేధించి మానసికంగా హింసించారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. త్విషా మృతదేహానికి రెండోసారి పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మధ్యప్రదేశ్ హైకోర్టు శుక్రవారం దీనికి అనుమతించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ బృందం రీ పోస్ట్‌మార్టం చేయాలని ఆదేశించింది. అయితే పది రోజులుగా పరారీలో ఉన్న త్విషా భర్త సమర్థ్ తన బెయిల్ దరఖాస్తు ఉపసంహరించుకుని కోర్టులో శుక్రవారం లొంగిపోయాడు.