న్యూఢిల్లీ : త్రిభాషా విధానంపై పాఠశాలలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కీలక ఆదేశాలు జారీచేసింది. పుస్తకాలు లేకపోయినప్పటికీ, మూడో భాషను బోధించాల్సిందేనంటూ స్పష్టంచేసింది. వారంలోగా దీన్ని అమలుచేయాలని ఉత్తర్వులు జారీచేసింది. స్థానికంగా లభ్యమయ్యే పుస్తకాలు, మెటీరియల్తో భోధన సాగించాలని స్కూళ్ల యాజమాన్యాలకు స్పష్టంచేసింది.
2026-27 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతి నుంచి త్రిభాషా విధానాన్ని సీబీఎస్ఈ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. మూడో భాష పాఠ్య పుస్తకాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని బోర్డు పేర్కొన్నది. తమ ఆదేశాల అమలును ప్రాంతీయ అధికారులు పర్యవేక్షిస్తారని పాఠశాలలను హెచ్చరించింది. ఆరో తరగతిలో ప్రవేశ పెట్టిన భాషలను మాత్రమే తర్వాత దశలో (తొమ్మిది, పది తరగతుల్లో) ఎంచుకొనే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.