CBSE | న్యూఢిల్లీ: తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఓపెన్-బుక్ ఎగ్జామ్స్‌ను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. జూన్ 25న ఈ నిర్ణయాన్ని బోర్డ్ పాలక మండలి ఆమోదించింది. బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి, సమర్థత ఆధారంగా నేర్చుకొనే విధానాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ విధానంలో ప్రతి టర్మ్‌లో భాషలతో పాటు గణిత, సైన్స్, సాంఘిక శాస్ర్తాల్లో ఓపెన్-బుక్ అసెస్మెంట్స్ అమలు చేస్తారు. విమర్శనాత్మక ఆలోచనను పెంచడం, వాస్తవ ప్రపంచ విషయాలను అన్వయించుకోవడాన్ని ప్రోత్సహించడం, పరీక్షల సంబంధిత ఒత్తిడిని దూరం చేయడం కోసం ఈ కొత్త విధానాన్ని అమలు చేయనున్నారు.
ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా కొన్ని ఎంపిక చేసిన స్కూళ్లలో పరీక్షించారు. ఇందులో చాలా మంది రెఫరెన్స్ మెటీరియల్‌ను సమర్థంగా ఉపయోగించుకోవడంలో, అంతర్గత విషయాలను అర్థం చేసుకోవడంలో సవాళ్లు ఎదుర్కొన్నారు. ఈ విధానాన్ని సజావుగా అమలు చేయడానికి సీబీఎస్ఈ వివరణాత్మకంగా మార్గదర్శకాలను రూపొందించనుంది. ఓపెన్-బుక్ అసెస్మెంట్ విధానంలో పరీక్షల సమయంలో విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు ఇతర ఆమోదిత వనరులను రెఫర్ చేసుకోవచ్చు.