Hindi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: దేశంలో హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నానికి కేంద్రం తెరతీసిందా?. అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. వచ్చే ఏడాది నుంచి ఏడాదికి రెండు సార్లు పదో తరగతి బోర్డు పరీక్షలు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవల ముసాయిదా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో లాంగ్వేజ్ పేపర్లకు సంబంధించి పలు మార్పులు చేసింది. కొత్త విధానం ప్రకారం సబ్జెక్టు గ్రూప్‌లలో ఇంగ్లిష్, హిందీని లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 సబ్జెక్టులుగా పేర్కొన్నారు.
ఇతర స్థానిక, విదేశీ భాషలను ‘ప్రాంతీయ, విదేశీ భాషా గ్రూప్’లో చేర్చారు. అలాగే హిందీ, ఇంగ్లిష్ పేపర్లకు వేర్వేరు పరీక్ష తేదీలుంటాయి. ఇతర భాషా సబ్జెక్టులకు ఒకే రోజు పరీక్ష జరుగుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని సబ్జెక్టులు, లాంగ్వేజ్‌లు 2025-26 విద్యా సంవత్సరంలో కూడా కొనసాగుతాయని సీబీఎస్ఈ స్పష్టం చేసింది.
ప్రాంతీయ, విదేశీ భాషల గ్రూప్‌లో తెలుగు, కన్నడ, అస్సామీ, పంజాబీ సహా 14 భాషలను చేర్చినట్టు పేర్కొంది. అయితే లాంగ్వేజ్ 1గా ఇంగ్లిష్, లాంగ్వేజ్ 2గా హిందీని ఎందుకు పెట్టింది, మిగిలిన భాషలకు ఆప్షనల్ స్టేటస్‌ను ఎందుకు పెట్టిందో సీబీఎస్ఈ వివరణ ఇవ్వలేదు. ప్రస్తుతం అమలవుతున్న సిలబస్‌లో లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 తప్పనిసరి సబ్జెక్టుల జాబితాలో ఉన్నప్పటికీ, విద్యార్థి 38 భాషల్లోంచి తనకు ఇష్టమైన సబ్జెక్టును ఎన్నుకోవచ్చు. కొత్త ముసాయిదాలా ఇంగ్లిష్, హిందీయే ఎన్నుకోవాల్సిన అవసరం లేదు.