NEET | న్యూఢిల్లీ, జూన్ 23: నీట్-యూజీ అక్రమాల కేసులో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీతో పాటు పరీక్షపై వచ్చిన ఆరోపణల విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 120-బీ(నేరపూరిత కుట్ర), 420(మోసం) కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. పేపర్ లీక్ ఆరోపణలతో కేసులు నమోదైన బీహార్ రాజధాని పట్నాకు, గుజరాత్‌లోని గోద్రాకు రెండు సీబీఐ బృందాలు వెళ్లాయి. ఈ రెండు రాష్ర్టాల్లో పోలీసులు నమోదు చేసిన కేసుల విచారణను తమ పరిధిలోకి తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు సీబీఐ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, మే 5న దేశవ్యాప్తంగా జరిగిన నీట్-యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందనే ఆరోపణలు రావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 67 మందికి 720 మార్కులకు 720 మార్కులు రావడంతో వివాదం రాజుకుంది. ప్రస్తుతం బీహార్‌లో పేపర్ లీకేజీకి సంబంధించి ఆ రాష్ట్ర పోలీసు శాఖలోని ఆర్థిక నేరాల విచారణ విభాగం దర్యాప్తు ప్రారంభించి పలువురిని అరెస్టు చేసింది.
నీట్-యూజీ పరీక్షలో అక్రమాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ప్రైవేటు కోచింగ్ సెంటర్లను నడుపుతున్న ఇద్దరు టీచర్లను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్కాడ్(ఏటీఎస్) అదుపులోకి తీసుకుంది. శనివారం రాత్రి వీరిని అదుపులోకి తీసుకొని కొన్ని గంటల పాటు విచారించిన తర్వాత వదిలిపెట్టినట్టు ఏటీఎస్ అధికారి ఒకరు తెలిపారు. మళ్లీ అవసరమైతే వీరిని విచారణకు పిలుస్తామని చెప్పారు. ఈ ఇద్దరిలో ఒకరు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
నీట్-యూజీ పరీక్షలకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతున్న బీహార్ ఆర్థిక నేరాల విచారణ విభాగం కొత్త విషయాన్ని గుర్తించింది. పరీక్షపత్రాలను ఎన్టీఏ డిజిటల్ లాక్‌లు కలిగిన ప్రత్యేక బాక్సుల్లో పరీక్షా కేంద్రాలకు పంపిందని, కానీ ఇవి తీరా పరీక్ష మొదలయ్యే సమయానికి తెరుచుకోలేదని పేర్కొన్నది. వాస్తవానికి ఇవి పరీక్ష ప్రారంభానికి ముందు ఆటోమెటిక్‌గా తెరుచుకోవాలి. కానీ, పలు కేంద్రాల్లో డిజిటల్ లాక్‌లు పని చేయకపోవడంతో మాన్యువల్‌గా బాక్సులను తెరవాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులకు ఆలస్యంగా ప్రశ్నాపత్రాలు అందాయి. పరీక్షా సమయాన్ని కోల్పోయిన 1,563 మంది విద్యార్థులకు ఎన్టీఏ మొదట గ్రేస్ మార్కులు కలుపగా, అది వివాదంగా మారింది. దీంతో తర్వాత గ్రేస్ మార్కులను తొలగించి, మళ్లీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.
పట్నా, జూన్ 23: యూజీసీ-నెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కేసులో విచారణకు వెళ్లిన సీబీఐ అధికారుల బృందంపై బీహార్‌లో దాడి జరిగినట్టు తెలుస్తున్నది. కేంద్ర విద్యా శాఖ ప్రతిపాదన మేరకు గురువారం యూజీసీ-నెట్ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో విచారణ జరిపేందుకు శనివారం సాయంత్రం బీహార్‌లోని నవాడా సమీపంలో ఉన్న కసియాదేహ్ గ్రామానికి సీబీఐ అధికారులు వెళ్లారు. ఈ విషయాన్ని గుర్తించిన కొందరు స్థానికులు సీబీఐ వాహనాల చుట్టూ గుమిగూడి, అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో సీబీఐ అధికారులు స్థానిక రాజౌలి పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి స్థానికులను అడ్డుకున్నారు. ప్రభుత్వ పనికి అడ్డంకులు కల్పించడం, దాడి చేయడం వంటి ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశారు.