న్యూఢిల్లీ: జేఈఈ – 21 మెయిన్స్ పరీక్షలో అక్రమాలకు పాల్పడిన కేసులో దేశవ్యాప్తంగా 19 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరిపింది. ఢిల్లీతోపాటు పుణె, జంషెథ్పూర్, ఇండోర్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో జరిగిన సోదాల్లో 25 ల్యాప్టాప్లు, 7 కంప్యూటర్లు, 30 పోస్ట్ డేటెడ్ చెక్కులు, పలువురు విద్యార్థుల మార్క్ షీట్లు, సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ ప్రకటించింది. 2021 జేఈఈ(మెయిన్స్) పరీక్షలో హర్యానాలోని సోనెపట్ పట్టణంలోని ఓ పరీక్ష కేంద్రంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. అఫినిటీ ఎడ్యుకేషన్ అనే సంస్థ డైరెక్టర్లు సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంబర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నేతో పాటు మరికొందరు వ్యక్తులు పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు రిమోట్ ద్వారా జవాబులు చేరవేశారు. ఉత్తీర్ణత సాధించి సీట్లు పొందిన ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.12 – 15 లక్షల వరకు వసూలు చేశారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతున్నది.