DK Shivakumar | న్యూఢిల్లీ: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అక్రమాస్తుల వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దర్యాప్తును ముమ్మరం చేసింది. కేరళలోని జైహింద్ చానల్‌కు ఆదివారం నోటీసులు జారీచేసింది. డీకే, ఆయన కుటుంబ సభ్యులు చానల్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలియజేయాలని కోరింది. దర్యాప్తు అధికారి కోరిన అన్ని పత్రాలను తీసుకుని, జనవరి 11న బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో హాజరు కావాలని జైహింద్ కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించింది. శివకుమార్, ఆయన సతీమణి ఉష, వారి కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పెట్టిన పెట్టుబడులు, వారికి ఇచ్చిన డివిడెండ్ల వివరాలను తెలపాలని కోరింది. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం ఈ నోటీసును ఇచ్చింది.
జైహింద్ చానల్ ఎమ్డీ బీఎస్ షిజు మాట్లాడుతూ, సీబీఐ కోరిన అన్ని పత్రాలను సమర్పిస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ఏ పనినీ చేయలేదన్నారు. ఇదంతా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు. డీకే శివకుమార్‌పై 2020లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన 2013-18 మధ్య ఆదాయానికి మించి రూ.74 కోట్లు అక్రమంగా ఆర్జించినట్టు అందులో ఆరోపించింది. కేరళలో సీపీఎంకి చెందిన కైరళి టీవీకి పోటీగా 2007లో కాంగ్రెస్ పార్టీ జైహింద్ చానల్ని ప్రారంభించింది.