న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌పై (Satya Pal Malik) నమోదైన అవినీతి కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. కిష్త్వార్లోని రూ.2,200 కోట్ల కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు సత్యపాల్ మాలిక్ గతంలో ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని 2022లో సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఉన్నారు.
కాగా, 2022 ఏప్రిల్‌లో సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా 2024 ఫిబ్రవరిలో ఢిల్లీ, జమ్ముకశ్మీర్‌లోని సత్యపాల్ మాలిక్ నివాసాలతో సహా 30కు పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. మాలిక్ సహచరులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు అమలు సంస్థ చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న అధికారులను కూడా సీబీఐ లక్ష్యంగా చేసుకున్నది. ఇ-టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలని బోర్టు మీటింగ్‌లో నిర్ణయం తీసుకున్నప్పటికీ అది అమలు కాలేదని, చివరకు కాంట్రాక్టును పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కు అప్పగించారని, ఇందులో అక్రమాలు జరిగాయని సీబీఐ ఆరోపించింది.
మరోవైపు తాను ఎలాంటి తప్పు చేయలేదని సత్యపాల్ మాలిక్ మరోసారి స్పష్టం చేశారు. తనను బెదిరించే ప్రయత్నమని ఆయన విమర్శించారు. ‘నేను మూడు నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను, ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ ప్రభుత్వ సంస్థల ద్వారా నా ఇంటిపై నియంత దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని. ఈ దాడులకు నేను భయపడను. నేను రైతుల వెంట ఉన్నాను’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.