న్యూఢిల్లీ: యూకో బ్యాంక్(UCO Bank)లో భారీ స్కామ్ జరిగిన విషయం తెలిసిందే. సుమారు 820 కోట్ల ఐఎంపీఎస్ స్కామ్‌కు సంబంధించిన కేసులో ఇవాళ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 62 ప్రదేశాల్లో తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
రాజస్థాన్, మహారాష్ట్రకు చెందిన ఏడు నగరాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐఎంపీఎస్ లావాదేవీలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. సోదాల సమయంలో యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 డాక్యుమెంట్లను సీజ్ చేశారు. వాటితో పాటు 43 డిజిటల్ డివైస్‌లు ఉన్నాయి. ఫోరెన్సిక్ అనాలసిస్ కోసం వాటిని పంపించారు. ఈ కేసులో సుమారు 30 మంది అనుమానితులను సీబీఐ విచారిస్తున్నది.