న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష లీకేజీ కేసు(NEET Paper Leak Case)లో ఇవాళ కొన్ని అరెస్టులు జరిగాయి. లాతూరుకు చెందిన ఓ డాక్టర్‌ను, పుణె కోచింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన ఫిజిక్స్ టీచర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీబీఐ అధికారులు ఆ ఇద్దర్నీ అరెస్టు చేశారు. ముగ్గురు నీట్ విద్యార్థులకు సహకరించిన కేసులో మనోజ్ షిరూర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. రేణుకాయి కెమిస్ట్రీ క్లాసెస్ వ్యవస్తాపకుడు శివరాజ్ రఘునాథ్ మోటేగావకర్ కుమారుడికి మనోజ్ ప్రశ్నలు అందించినట్లు తెలిసింది. నీట్ కెమిస్ట్రీ పేపర్‌ను సెట్ చేసిన పీవీ కులకర్ణ నుంచి మనోజ్ ప్రశ్నలు రాబట్టినట్లు భావిస్తున్నారు. ఆర్సీసీ వ్యవస్థాపకుడు శివరాజ్‌ను ఈ కేసులో ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
పుణెలో ఉన్న డాక్టర్ అభంగ్ ప్రభు మెడికల్ అకాడమీ కోచింగ్ సెంటర్లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న తేజస్ హర్షద్ కుమార్ షాను సీబీఐ అదుపులోకి తీసుకున్నది. పేపర్ లీకేజీ కేసులో అరెస్టు అయిన మనీషా హవల్దార్ నుంచి ఫిజిక్స్ ప్రశ్నాపత్రాన్ని షా అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు మొత్తం 13 మంది అరెస్టు అయ్యారు. నీట్ పేపర్ లీకేజీ కేసులో పాల్గొన్న ముఠాను అరెస్టు చేసేందుకు సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు 49 లొకేషన్లలో సీబీఐ సోదాలు చేపట్టింది. అనేక డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లను సీబీఐ సీజ్ చేసింది.
మే 3వ తేదీన జరిగిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 12వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ అయినట్లు నిర్ధారణ జరగడంతో ఆ నిర్ణయం తీసుకున్నారు. అయితే జూన్ 21వ తేదీన రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. ఉన్నత విద్యాశాఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పుణె, లాతూరు, అహిల్యానగర్ నుంచి మొత్తం 13 మందిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ప్రశ్నపత్రాన్ని లీక్ చేసి, లక్షలు సంపాదించిన మధ్యవర్తులను కూడా అరెస్టు చేశారు.