న్యూఢిల్లీ, మే 15: నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన నిందితులలో ఒకరికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు నీట్-యూజీ 2025లో ఉత్తీర్ణులయ్యారనే విషయం బయటపడడంతో ఆ పరీక్షపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. తాజాగా నీట్ పేపర్ లీక్ కేసులో రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన దినేశ్, మంగీలాల్ బివాల్ అనే ఇద్దరు సోదరులను సీబీఐ అరెస్టు చేసింది. వారితోపాటు వారి మేనల్లుడు వికాస్‌ను పట్టుకున్న సీబీఐ 2025లో కూడా వారికి ఈ పేపర్లు అందుబాటులో ఉన్నాయా అనే విషయంపై దర్యాప్తు ప్రారంభించింది.
2025 ప్రారంభంలో బివాల్ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు నీట్ పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు పొందారు. దినేశ్ బివాల్ ఒక ఫేస్బుక్ పోస్టులో తమ కుటుంబం నుంచి ఐదుగురు విద్యార్థులు నీట్లో ఎంపికయ్యారని తెలియచేశాడు.నీట్ 2026 లీకేజీ కుంభకోణాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ దర్యాప్తులో లీకైన ప్రశ్నపత్రం యష్ యాదవ్ ద్వారా రాజస్థాన్‌లోని తనకు పరిచయస్తుడైన వికాస్ బివాల్‌కు చేరుకుంది. వికాస్ మేనమామ దినేశ్ బివాల్ ఈ గెస్ పేపర్ హార్డ్ కాపీని స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైళ్లు తయారు చేశాడు. 12వ తరగతిలో సెకండ్ డివిజన్, కోచింగ్‌లో 50% సగటు మార్కులు సాధించినప్పటికీ బివాల్ కుటుంబ సభ్యులు నీట్ పరీక్షలో 90% పైగా మార్కులు సాధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు సంపాదించడం విశేషం. 2025లో కూడా బివాల్ లీకైన నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలే జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, దినేశ్ బివాల్, గురుగ్రామ్‌కు చెందిన యశ్ యాదవ్, నాసిక్‌లో శుభమ్ ఖైర్నార్‌లను సీబీఐ అరెస్టు చేసింది. నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సవాయి మాదోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించిన మంగీలాల్ బివాల్ కుమారుడు వికాస్ 10వ తరగతిలో 63%, 12వ తరగతిలో 55% సాధించినట్లు తెలుస్తున్నది. నీట్ 2024 పరీక్షలో మంగీలాల్ కుమారుడు 720 మార్కులకు గాను కేవలం 270 మాత్రమే సాధించాడు. సికార్‌లోని ఒక కోచింగ్ సెంటర్లో తీసుకున్న 46 టెస్టులలో వికాస్ సగటు స్కోరు 384గా ఉంది. అయినప్పటికీ వికాస్ నీట్ 2025లో 85.11 పర్సంటైల్ సాధించాడు. ప్రస్తుతం సవాయి మాదోపూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
లీకైన గెస్ పేపర్ అమ్మకంలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై వికాస్‌ను ఇప్పుడు అరెస్టు చేశారు. నీట్ యూజీ 2026 పేపర్‌ను ముందుగానే సేకరించి పంపిణీ చేయడానికి రూ. 65 లక్షలకు పైగా చెల్లించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. మంగీలాల్ కుమార్తె, వికాస్ సోదరి ప్రగతి కథ కూడా ఇలాంటిదే. ఆమె 10వ తరగతిలో 69%, 12వ తరతగతిలో 91% మార్కులు సాధించి దౌసా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించుకుంది. నీట్ 2024లో 332 మార్కులు సాధించింది. కోచింగ్ పరీక్షలో ఆమె సగటు సుమారు 302గా ఉన్నట్లు సమాచారం. అయినప్పటికీ నీట్ 2025లో ప్రగతి 89.08 పర్సంటైల్ సాధించింది.
దినేశ్ బివాల్ కుమార్త్తె గుంజన్ 10వ తరగతిలో 86%, 12వ తరగతిలో 70% మార్కులు సాధించింది. నీట్ 2024లో 355 మార్కులు సాధించింది. నీట్ యూజీ 2025లో ఉత్తీర్ణత సాధించి వారణాసిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో అడ్మిషన్ సంపాదించుకుంది. బివాల్ మరో సోదరుడైన ఘనశ్యామ్ కుమార్తె సానియా కూడా ముంబైలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందింది. అయితే సికార్‌లో ఆమె కోచింగ్ టెస్టు సగటు 341 నుండి 361 మధ్య ఉంది. నీట్ 2024లో కేవలం 360 మార్కులు పొందిన సానియా 2025లో ఏకంగా 94.07 పర్సంటైల్ సాధించింది. బివాల్ కుటుంబం నుంచి నిలకడగా సగటు కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్న ఏకైక అభ్యర్థి ఘనశ్యామ్ బివాల్ మరో కుమార్తె పలక్ బివాల్, ఆమె 10వ తరగతిలో 93%, 12వ తరగతిలో 89%, నీట్ 2024లో 512 మార్కులు, నీట్ 2025లో పలక్ 98.61 పర్సంటైల్ సాధించింది. దాని ఆధారంగా జైపూర్‌లోని ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందింది.