CBI FIR on GAIL Director | గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) మార్కెటింగ్ డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో తనిఖీలు, సోదాలు జరిపిన తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. శనివారం గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ నివాసాల్లో జరిపిన దాడుల్లో 1.30 కోట్ల క్యాష్, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.ఈఎస్ రంగనాథన్‌తోపాటు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసింది. ప్రైవేట్ వ్యక్తి పవన్గౌర్, రాజేశ్ కుమార్, న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న రిషబ్ పాలికెమ్ డైరెక్టర్ రాజేశ్కుమార్లతో కలిసి నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని, చట్ట విరుద్ధ కార్యకలాపాలు నిర్వహించాడని రంగనాథన్‌పై అభియోగాలు నమోదయ్యాయి.
గెయిల్ మార్కెటింగ్ చేసే పెట్రో కెమికల్స్‌తో వ్యాపారం చేసే ప్రైవేట్ సంస్థలు, రంగనాథన్ మధ్య పవన్ గౌర్, రాజేశ్ కుమార్ మధ్యవర్తులుగా ముడుపులు సేకరించారని అభియోగం. గత నెల 11న రంగనాథన్‌ను కలుసుకున్న రాజేశ్ కుమార్, పవన్ గౌర్ పెట్రో కెమికల్ ఉత్పత్తుల కొనుగోలుదారులకు కొంత డిస్కౌంట్ ఇవ్వాలని కోరారు. రెండు రోజుల తర్వాత గెయిల్ ప్రతిపాదిత డిస్కౌంట్‌ను గెయిల్ పరిగణనలోకి తీసుకుందని రాజేశ్‌కు పవన్గౌర్ చెప్పినట్లు అధికార వర్గాల కథనం. రంగనాథన్ డైరెక్షన్ మేరకు ప్రైవేట్ సంస్థల నుంచి గత నెల 17న రాజేశ్ కుమార్ ముడుపులు సేకరించారని వినికిడి.
రంగనాథన్ సూచన ప్రకారం పవన్ గౌర్ నివాసం నుంచి 18న గుర్గావ్ వాసి ఎన్ రామకృష్ణన్ నాయర్.. రూ.40 లక్షలు సేకరించారని అధికార వర్గాల కథనం. ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న ప్రైవేట్ సంస్థ తరపున ఈఎస్ రంగనాథన్‌కు ముడుపులు చెల్లింపులు జరిగినట్లు కూడా సీబీఐకి సమాచారం అందింది. రంగనాథన్ తరఫున రూ.10 లక్షల ముడుపులు తీసుకునేందుకు వచ్చిన వ్యక్తిపై సీబీఐ అధికారులు నిఘా పెట్టి, అదుపులోకి తీసుకున్నారు.
ఈఎస్ రంగనాథన్‌తోపాటు పవన్ గౌర్, రాజేశ్ కుమార్, ఎన్ రామకృష్ణన్ నాయర్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరబ్ గుప్తా, బన్సాల్ ఏజెన్సీకి చెందిన ఆదిత్య బన్సాల్లపై కేసు నమోదు చేసింది సీబీఐ. నిందితుల ఇండ్లపై దాడులు చేసి తనిఖీలు జరిపింది. గెయిల్ డైరెక్టర్ రంగనాథన్‌తోపాటు మరో ముగ్గురికి ఢిల్లీ ప్రత్యేక కోర్టు ఆదివారం వారం రోజుల సీబీఐ కస్టడీ విధించింది. రామకృష్ణన్ నాయర్ బెయిల్ పిటిషన్‌ను స్పెషల్ జడ్జి వినోద్ యాదవ్ తిరస్కరించారు.