బెంగళూరు, డిసెంబరు 22,( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో ఓటర్ల డాటాకు రక్షణ లేకుండా పోతున్నది. ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో చిలుమే సంస్థ బెంగళూరు నగర ఓటర్ల సమాచారాన్ని అక్రమంగా సేకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వమే స్వయంగా రాష్ట్రంలోని ఓటర్ల వివరాల్ని కులాల వారీగా సమీకరించేందుకు ఆహార, పౌర సరఫరాల శాఖను సాధనంగా మలచుకోవడం వివాదాస్పదంగా మారింది. కుల మతాలతో నిమిత్తం లేకుండా పౌరుల ఆర్థిక స్థితిని బట్టి వారి కుటుంబాలకు బీపీఎల్ (దారిద్య్రరేఖకు దిగువన) , ఏపీఎల్ (దారిద్య్రరేఖకు ఎగువన) రేషన్ కార్డులు జారీచేస్తారు.
దీని ప్రకారం వేర్వేరు పరిమాణాల్లో, ఎంపిక చేసిన ఆహార పదార్థాల్ని ప్రతి నెలా చౌక డిపోల్లో తక్కువ ధరకు విక్రయిస్తారు. ఉన్నతాధికార్ల సూచన మేరకు ఆహార, పౌర సరఫరాల శాఖ డిప్యూటి డైరెక్టర్లు తమ పరిధిలోని చౌక దుకాణాలకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వాటి నిర్వాహకులు తమ దుకాణం నుంచి ప్రతి నెలా ఆహార పదార్థాల్ని పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన కులాలు, మతపర అల్ప సంఖ్యాకుల వివరాల్ని విధిగా ఒక పట్టిక రూపంలో పంపాలి. అందులో రేషన్ కార్డు సంఖ్య, లబ్ధిదారు బీపీఎల్ లేక ఏపీఎల్‌లో ఏ వర్గానికి చెందిన వ్యక్తి అనే వివరాన్ని, కుటుంబంలోని సభ్యుల సంఖ్యను నమోదు చేయాలి. ఈ వివరాల్ని క్రోడీకరించి సమగ్ర నివేదికనూ ఇవ్వాలి. రేషన్ కార్డుల సంఖ్య ద్వారా ఆయా కుటుంబాల చిరునామాను తెలుసుకోవచ్చు.
చిలుమే వ్యవహారం బెడిసికొట్టడంతో..
ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ కులాల వారీగా లబ్ధిదార్ల వివరాల్ని సమీకరించిన దాఖలాల్లేవని అధికారులు తెలిపారు. ‘ప్రస్తుత ప్రభుత్వం ఆ వివరాల కోసం ఉత్తర్వుల్ని జారీ చేసింది. దీని ఆంతర్యం ఏమిటో అర్థం కావటం లేద’ని వారు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు వివరాల్ని వాడుకునే అవకాశాల్ని తోసిపుచ్చలేమన్నారు. చిలుమే సంస్థ వ్యవహారం బెడిసి కొట్టటంతో ఓటర్ల వివరాల్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆహార పౌర సరఫరాల శాఖను ఉపయోగించుకుంటున్నదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార పదార్థాల వితరణ సవ్యంగా సాగుతున్నదో లేదో తెలుసుకునేందుకు కులాలు, మతాల వారీగా లబ్ధిదార్ల వివరాల్ని సమీకరించాల్సిన అవసరం లేదని, దీనికి భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందునే సందేహాలు వ్యక్తమవుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.