రాయ్‌పూర్ : అలవికాని హామీలతో మభ్యపెడుతూ ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలతో ఓటర్లను ఆశల పల్లకిలో ఊరేగిస్తోంది. ఆరు గ్యారంటీల పేరుతో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ చత్తీస్ఘఢ్లోనూ (Chhattisgarh Polls) అమలుకు గ్యారంటీ లేని పధకాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. చత్తీస్ఘఢ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఆదివారం తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. కుల గణన, రుణ మాఫీ, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ వంటి పాత హామీలనే వల్లెవేసింది.
రాజ్‌నంద్‌గావ్‌లో చత్తీస్ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ మ్యానిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ క్యాటగిరీల కోసం కుల గణన చేపట్టనున్నామని సీఎం చెప్పారు. అణగారిన వర్గాల వారికి సామాజికార్ధిక ప్రయోజనాలను అందించడంతో పాటు వారి కోసం ప్రత్యేక విధానాన్ని కూడా తమ ప్రభుత్వం రూపొందిస్తుందని తెలిపారు.
ధాన్యం క్వింటాల్‌కు రూ. 3200కు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రూ. 500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, రూ 10 లక్షల వరకూ ఆరోగ్య బీమా వర్తింపచేస్తామని అన్నారు. వ్యాపారాలకు 50 శాతం రుణ మాఫీని వర్తింపచేస్తామని వెల్లడించారు. ఇక నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో చత్తీస్ఘఢ్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More :
CPM | 14 మందితో అభ్యర్థుల జాబితా విడుదలచేసిన సీపీఎం.. జానా చెప్పినా వినని తమ్మినేని