French Fries | బెంగళూరు: తనను కనీసం ఫ్రెంచ్ ఫ్రైస్ తిననివ్వటం లేదు, క్రూరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో పోలీసులు 498ఏ, సెక్షన్-504 (ఉద్దేశపూర్వక అవమానం), వరకట్న నిషేధ చట్టం కింద కేసులు పెట్టారు. భర్త హైకోర్టును ఆశ్రయించటంతో దర్యాప్తును కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఉద్యోగ నిమిత్తం అమెరికాకు వెళ్లేందుకు అతడికి అనుమతించింది. తదుపరి విచారణకు అందుబాటులో ఉంటానని అతడు అఫిడవిట్ దాఖలు చేశాడు. సరైన ఆధారాల్లేకుండా 498ఏ సెక్షన్ కింద కేసు పెట్టారని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
కారులో హెల్మెట్ ధరించలేదని ఫైన్!
లక్నో: హెల్మెట్ ధరించకుండా కారు నడిపాడని యూపీలోని నోయిడా పోలీసులు జరిమానా విధించారు. బాధితుడు తుషార్ సక్సేనా మాట్లాడుతూ రూ.1,000 జరిమానా చెల్లించాలని గత ఏడాది నవంబరులో మెసేజ్ వచ్చిందని, అది పొరపాటున వచ్చిందేమోనని తాను పట్టించుకోలేదన్నారు. ఆ తర్వాత ఈ-మెయిల్, మెసేజ్లు రావడంతో పోలీసులను సంప్రదించానన్నారు. జరిమానా చెల్లించకపోతే కోర్టుకు రావలసి ఉంటుందని పోలీసులు తనను హెచ్చరించారని చెప్పారు. కారును నడిపేటపుడు హెల్మెట్ ధరించాలనే నిబంధన ఉంటే, అధికారులు లిఖితపూర్వకంగా తనకు ఇవ్వాలని కోరారు.