బెంగళూరు, జూలై 22: కర్ణాటకలో ‘వాల్మీకి’ స్కామ్‌పై జరుగుతున్న దర్యాప్తు అనూహ్య మలుపు తీసుకుంది. స్కామ్‌ను దర్యాప్తు చేస్తున్న ఇద్దరు ఈడీ అధికారులకు వ్యతిరేకంగా బెంగళూరులోని విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం సిద్ధరామయ్య, మాజీ మంత్రి బీ నాగేంద్ర, ఆర్థిక శాఖల పేర్లు చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారిని ఈడీ అధికారులు ఒత్తిడి చేశారని ఆరోపిస్తూ ఈ కేసు నమోదైంది.
కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.187 కోట్ల కుంభకోణంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. జూలై 16న సోషల్ వెల్ఫేర్ అదనపు డైరెక్టర్ కల్లేశ్ను కొన్ని గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా సీఎం సిద్ధరామయ్య, మాజీ మంత్రి బీ నాగేంద్ర, ఆర్థిక శాఖల పేర్లు చెప్పాలంటూ ఈడీ అధికారులు తనను బెదిరించారని కల్లేశ్ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.