Price Hike | న్యూఢిల్లీ, మార్చి 23: దేశంలో కార్ల ధరలు మరింత పెరగబోతున్నాయి. రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ లాంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు సహా మరికొన్ని ఇతర కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచుతున్నట్టు ప్రకటిస్తున్నాయి. దీంతో ఏప్రిల్ నుంచి ఆయా కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి. ప్యాసింజర్ కార్ల తయారీ విభాగంలో అగ్రగామి సంస్థగా కొనసాగుతున్న మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) తన అన్ని రకాల వాహనాల ధరలను 4% మేరకు పెంచేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ నుంచి హ్యుందాయ్ కార్ల ధరలను 3% వరకు పెంచబోతున్నట్టు ఆ కంపెనీ వెల్లడించింది.
ఇదేవిధంగా మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎస్యూవీలతోపాటు వాణిజ్య వాహనాల ధరలను 3% మేరకు పెంచనున్నట్టు తెలిపింది. కాగా, ఈ ఏడాది ఇప్పటికే ఓసారి వాహనాల ధరలను పెంచిన టాటా మోటర్స్ కంపెనీ.. వచ్చే నెల నుంచి తన ఎలక్ట్రిక్ వాహనాలతోపాటు ప్యాసింజర్ వాహనాల ధరలను మరోసారి పెంచనున్నట్టు స్పష్టం చేసింది. కియా, హోండా, రెనాల్ట్, బీఎండబ్ల్యూ కంపెనీలు కూడా ఏప్రిల్ నుంచి తమ కార్ల ధరలను పెంచబోతున్నట్టు ప్రకటించాయి. దేశంలో ఆటోమొబైల్ కంపెనీలు ఏటా రెండుసార్లు తమ వాహనాల ధరలను పెంచడం సాధారణమేనని డెలాయిట్ పార్ట్నర్, ఆటోమోటివ్ సెక్టార్ లీడర్ రజత్ మహాజన్ తెలిపారు.