నోయిడా, జనవరి 18: ‘నాన్నా నాకు బతకాలని ఉంది’ అంటూ ఒక టెకీ జీవితపు ఆఖరి క్షణంలో ఆర్తనాదాలు చేస్తూ కన్ను మూసిన విషాద ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. ఒక వైపు దట్టమైన పొగమంచు, రిఫ్లెక్టర్లు లేని పరిస్థితిలో ఒక యువ టెకీ నడుపుతున్న కారు డ్రైనేజీ బౌండరీని ఢీకొని లోతైన నీటి గుంతలో పడిపోయింది. కాపాడాలంటూ ఆయన ఆర్తనాదాలు చేసినా, సహాయక చర్యలు ఆలస్యం కావడంతో ప్రాణాలు కోల్పోయాడు. టెకీగా పనిచేస్తున్న యువరాజ్ మెహతా శుక్రవారం రాత్రి డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తుండగా, 150 సెక్టార్ సమీపంలో దట్టమైన మంచు కారణంగా అతని కారు పక్కపక్కనే ఉన్న రెండు డ్రైనేజీ బేసిన్లు వేరు చేసే ఎత్తయిన ప్రాంతాన్ని ఢీకొని నీటితో నిండి ఉన్న 70 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది.
అతని అరుపులు విని చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నా అంత లోతైన గుంతలో నుంచి అతడిని రక్షించే పరిస్థితి కన్పించక పోలీసులకు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో టెకీ తన తండ్రికి కూడా ఫోన్ చేశాడు. ‘నాన్నా.. నేను నీటితో ఉన్న పెద్ద లోతైన గుంతలో పడిపోయాను… మునిగిపోతున్నాను. త్వరగా వచ్చి రక్షించండి.. నాకు చావాలని లేదు’ అంటూ రోదించాడు. స్థానిక పోలీసులు, జాతీయ విపత్తు రక్షణ దళం టీమ్లు అక్కడికి చేరుకుని అతడిని రక్షించే ప్రయత్నాలు చేశారు. అతని తండ్రి కూడా అక్కడికి చేరుకున్నాడు. ఎట్టకేలకు ఐదు గంటల తర్వాత టెకీని, అతడి కారును వెలికి తీశారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. కాగా, ఆ సర్వీస్ రోడ్లో రిఫ్ల్లెక్టర్లు పెట్టకుండా, కనీసం డ్రైన్లను మూయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళన నిర్వహించారు. దీంతో కొన్ని గంటలకు అధికారులు ఆ లోతైన గుంతను పలు టన్నుల చెత్తతో పూడ్చిపెట్టారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.