న్యూఢిల్లీ : పంజాబ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం పదవి నుంచి వైదొలగి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో రగులుతున్న కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ ఏర్పాటు దిశగా యోచిస్తున్నారని సమాచారం. కెప్టెన్ సింగ్ బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కావడంతో ఆయన కాషాయ పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగగా బీజేపీలో చేరబోనని ఆ ప్రచారానికి సింగ్ తెరదించారు. బీజేపీలో చేరనని, అలాగే తనను అవమానాలకు గురిచేసిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగనని తేల్చిచెప్పారు.
కెప్టెన్ అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ఏర్పాటుకే మొగ్గుచూపుతున్నారని భావిస్తున్నారు. పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 నుంచి 30 మంది కెప్టెన్‌తో టచ్‌లో ఉన్నట్టు చెబుతున్నారు. మరోవైపు పంజాబ్ సీఎం చరణ్‌జిత్‌సింగ్ చన్నీతో రెబెల్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ భేటీ కానుండటంతో పంజాబ్ రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. సిద్ధూను సంతృప్తిపరిచేందుకు అమరీందర్ సింగ్‌ను కాంగ్రెస్ సాగనంపగా అటుపై జరిగిన పరిణామాల నేపధ్యంలో సిద్ధూ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఇరకాటంలో పడింది. సిద్ధూ నిలకడ లేని వ్యక్తని తాను ముందునుంచి చెబుతున్నానని కెప్టెన్ సింగ్ సైతం వ్యాఖ్యానించారు.