Capt Amarinder Singh : బీజేపీ నేత, పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తే అవుననే అనిపిస్తోంది. కెప్టెన్ అమరిందర్ సింగ్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత, హరియాణా మాజీ సీఎం భూపిందర్ హుడా తెలిపారు. దీంతో అమరిందర్ సింగ్ కాంగ్రెస్‌లో చేరడానికి మార్గం సుగమం అవుతుంది. ఇదే జరిగితే.. పంజాబ్‌లో అటు కాంగ్రెస్‌కు లాభం కలిగితే, బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తప్పదు.
కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు అమరిందర్ సింగ్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో బీజేపీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి కూడా ఆయన హాజరుకాలేదు. అలాగే, పంజాబ్‌లో బీజేపీ నూతన చీఫ్‌గా కేవల్ సింగ్ ధిల్లాన్‌ను పార్టీ నియమించింది. ఈ సమయంలో పార్టీ తనను సంప్రదించలేదని కెప్టెన్ తెలిపారు. కేవల్ సింగ్ ప్రమాణ స్వీకారానికి బీజేపీకి చెందిన కీలక నేతలు హాజరైనప్పటికీ కెప్టెన్ మాత్రం హాజరుకాలేదు. ఇదే సమయంలో ఒక సందర్బంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అమరిందర్ సింగ్ పొగిడారు.
అటు బీజేపీకి దూరంగా ఉండటం, కాంగ్రెస్ నేతను పొగడటం కారణంగా ఆయన బీజేపీకి వీడనున్నారా అనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా భూపిందర్ హుడా ప్రకటనతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. ఈ విషయంపై అమరిందర్ సింగ్‌తో చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అమరిందర్ సింగ్.. కాంగ్రెస్ పార్టీలో అత్యధిక కాలం కొనసాగారు. కాంగ్రెస్ తరఫున పంజాబ్ సీఎంగా కూడా కొనసాగారు. కానీ, అనూహ్య పరిణామాల మధ్య 2021లో కాంగ్రెస్ పార్టీ ఆయనను సీఎం పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
పంజాబ్ లోక్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. కానీ, 2022లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయింది. ఆ తర్వాత తన పార్టీని బీజేపీలో 2022లో విలీనం చేశారు. ఇంతకాలం బీజేపీలో కొనసాగిన ఆయన ఆ పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తిరిగి సొంత గూటికి చేరుతారా లేక బీజేపీలోనే కొనసాగుతారా అనేది త్వరలోనే తేలనుంది.