ECI | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ బ్యాలెట్ పేపర్ రూపకల్పన, ముద్రణ శైలిని కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. స్పష్టంగా చదవగలిగేలా, చూడగలిగేలా చర్యలు తీసుకున్నది. 1961 ఎన్నికల నిర్వహణ నియమాల్లోని రూల్ 49B సూచనలను కమిషన్ సవరిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఈవీఎంలలో అభ్యర్థి పేరు, గుర్తుతో పాటు వారి కలర్ ఫొటోను ప్రదర్శించనున్నారు. ఈ మార్పును బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలు చేయనున్నది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరిచేందుకు ఈసీ ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటున్నది. గత ఆరు నెలల్లో 28 చర్యలు తీసుకున్నది. ఇందులో సర్ అంశం కూడా ఒకటి. ఈవీఎం బ్యాలెట్ పేపర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల కలర్ ఫొటోలను ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై ముద్రిస్తారు. అభ్యర్థి ఫొటో స్పష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టింది. పేపర్‌పై ఫాంట్ పరిమాణం, నాణ్యత సైతం పెంచనున్నది.
అభ్యర్థుల సీరియల్ నంబర్లు, పేర్లు, ఫాంట్ అన్నీ ఒకే పరిమాణంలో ఉంటాయి. తద్వారా అవి సులభంగా చదవగలిగేలా ఉండనున్నాయి. దాంతో పాటు ఈవీఎం బ్యాలెట్ పత్రాలను 70 జీఎస్ఎం పేపర్‌పై ముదిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు నిర్ణయించిన ఆర్జీబీ పింక్ కలర్ పేపర్‌ను ఉపయోగిస్తారు. ఈ పేపర్ క్వాలిటీ మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ చొరవతో ఓటింగ్ ప్రక్రియ సజావుగా ఉంటుందని ఈసీ పేర్కొంటున్నది. అదే సమయంలో పారదర్శకత, ఎన్నికలపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని చెబుతున్నది. కల్ ఫొటోలు, పెద్ద ఫాంట్, క్వాలిటీ పేపర్ కారణంగా ఓటర్లు ఎలాంటి గందరగోళానికి గురవకుండా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నది. గ్రామీణ ప్రాంతాలతో పాటు సీనియర్ సిటిజన్లకు ఇంకా ప్రయోజనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈవీఎంలపై బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు, చిన్న ఫాంట్‌తో అక్షరాల కారణంగా ఇబ్బందులుపడే వారు. కొత్త వ్యవస్థతో ఓటింగ్ ప్రక్రియను మరింత ప్రజాస్వామ్యబద్ధంగా, సజావుగా సాగేలా చేస్తుందని ఈసీ భావిస్తున్నది.