కోల్‌కతా, జనవరి 7: పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చిత్తరంజన్ నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్(సీఎన్‌సీఐ) రెండో క్యాంపస్ ప్రారంభంపై వివాదం రేగింది. శుక్రవారం వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించగా, అదే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మమత బెనర్జీ.. ఈ క్యాంపస్‌ను తాము ఇప్పటికే ప్రారంభించామని, ఈ విషయాన్ని ప్రధాని మోదీకి తెలియజేయాలని అనుకుంటున్నానని అన్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రెండుసార్లు ఫోన్ చేశారని, ప్రధాని ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందున కార్యక్రమానికి హాజరయ్యానని చెప్పారు. ‘కరోనా ప్రారంభ సమయంలో కోల్‌కతాలో ఐసొలేషన్ సెంటర్ అవసరమైంది. ఈ క్యాంపస్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా 25 శాతం నిధులు వెచ్చించినందున దీన్ని మేం అప్పుడే ప్రారంభించాం’ అని పేర్కొన్నారు.