న్యూఢిల్లీ : ప్రపంచంలో వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సవాళ్లలో క్యాన్సర్ ఒకటిగా నిలిచింది. ప్రతి అయిదుగురిలో ఒకరు తమ జీవిత కాలంలో క్యాన్సర్ బారినపడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ప్రపంచ స్థితి నివేదిక-2026 హెచ్చరించింది. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధనా ఏజెన్సీ(ఐఏఆర్సీ) తో కలిసి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా 2.6 కోట్ల కొత్త క్యాన్సర్ కేసులు, కోటి మరణాలు నమోదవుతున్నాయి.
వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే, 2050 నాటికి వార్షిక క్యాన్సర్ కేసుల సంఖ్య సుమారు 3.5 కోట్లకు చేరుతుందని తెలిపింది. దీని వల్ల ఆరోగ్య సంరక్షణ విధానాలపై మోయలేని భారం పడుతుందని తెలిపింది. క్యాన్సర్ వల్ల రోగులు, వారి కుటుంబాలపై శారీరక, మానసిక, ఆర్థిక భారం పెరుగుతున్నదని నివేదిక పేర్కొంది. లక్షలాది మందికి నాణ్యమైన చికిత్స అందడం లేదని తెలిపింది.