ముంబై: అవాంఛిత గర్భాన్ని కొనసాగించమంటూ లైంగిక దాడి బాధితురాలిని ఒత్తిడి చేయలేమని పేర్కొన్న బాంబే హైకోర్టు, వైద్య నిపుణుల నుంచి ప్రతికూల నివేదిక వచ్చినప్పటికీ ఆమె 28 నెలల గర్భాన్ని తొలగించుకోవడానికి అనుమతిని మంజూరు చేసింది. ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా బిడ్డను కనాలని ఒత్తిడి చేయడం, ఆమె తన జీవన గమనాన్ని నిర్ణయించుకునే హక్కును అందకుండా చేయడమే అవుతుందని న్యాయస్థానం పేర్కొంది.
బాధితురాలి వయస్సు, గర్భస్థ శిశువు స్థితిని పరిశీలించిన తర్వాత బాలిక గర్భ విచ్ఛిత్తి చాలా ప్రమాదకరమని బాలికను పరీక్షించిన మెడికల్ బోర్డు న్యాయస్థానానికి తెలిపింది. అయినప్పటికీ బాలిక గర్భస్రావానికి అనుమతినిస్తూ జస్టిస్‌లు సాంబ్రే, సచిన్ దేశ్‌ముఖ్‌లతో కూడిన ధర్మాసనం ఈ నెల 17న ఆదేశాలు జారీ చేసింది. 12 ఏండ్ల బాలికపై ఆమె మామ అత్యాచారం చేయడంతో ఆమె గర్భవతి అయ్యింది. ఈ కేసులో ఆమె గర్భాన్ని తొలగించేలా ఆదేశాలివ్వాలంటూ బాధితురాలి తండ్రి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.